- టాలీవుడ్, బాలీవుడ్‌లో విషాదం

ముంబై: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ (74) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు కన్నుమూశారు. బ్లడ్ క్లాట్ అవడంతో గుండెపోటు రావడమే ఆయన మృతికి కారణమని కుటుంబ సభ్యులు, వైద్యులు తెలిపారు.
సౌత్‌లో 70కి పైగా చిత్రాల్లో..
దక్షిణాదిలో విలన్‌గా, కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ నటుడిగా మారిన ప్రదీప్ రావత్.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి మొత్తం 70కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో వరుసగా ప్రముఖ చిత్రాల్లో నటిస్తూ వచ్చిన ఆయన, చివరిగా ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో కనిపించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆమిర్ ఖాన్ ‘గజినీ’ చిత్రంలోనూ ఆయన విలక్షణ నటనకు మంచి పేరు వచ్చింది.
తీరని కోరికతోనే అస్తమయం..
- ప్రదీప్ రావత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక విషాదకరమైన కోణం ఉంది. ఆయన తన ఒక్కగానొక్క కుమారుడిని ఎలాగైనా సినిమా రంగంలో హీరోగా నిలబెట్టాలనే గట్టి పట్టుదలతో, ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. అయితే, ఆ కోరిక తీరకుండానే ఆయన ఆకస్మికంగా మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు కన్నీరుమున్నీరవుతున్నారు.ప్రదీప్ రావత్ హఠాన్మరణం పట్ల టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు