రాజేంద్రనగర్: సహచర మహిళా అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రిమాండ్‌లో ఉన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ముత్యాల ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.గురువారం ఉప్పరపల్లిలోని రాజేంద్రనగర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఉదయ్ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు పోలీసులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, నిందితుడికి సంబంధించిన ఐఫోన్ ఇంకా లభ్యం కాలేదని, కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని పోలీసులు కోర్టుకు వివరించినట్లు తెలిసింది. పోలీసులు దాఖలు చేసే కౌంటర్ ఆధారంగా శుక్రవారం ఈ బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. తోటి ట్రైనీ ఐపీఎస్‌ను వేధించిన కేసులో ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.