PRABANJANAM
Date of Publish : 26 September 2026, 2:25 pm Posted by : Prabanjanam News

ఔటర్‌ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

  • టైరు పేలి పల్టీకొట్టిన వాహనం..
  • మరో 11 మందికి గాయాలు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కీసర పోలీసులు

కీసర: ( ప్రభంజనం )

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో కీసర నుంచి శామీర్‌పేట వైపు వెళ్తున్న అశోక్‌ లేలాండ్‌ వాహనం వెనుక టైరు ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 11 మంది స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. కూలీలను తీసుకుని అశోక్‌ లేలాండ్‌ వాహనం కీసర నుంచి శామీర్‌పేట వైపు వెళ్తోంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో వాహనం వెనుక టైరు అకస్మాత్తుగా పేలింది. దీంతో డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అది పల్టీలు కొట్టినట్లు సమాచారం. ప్రమాదంలో మంగీలాల్‌ (60), సురేఖ (40) మృతి చెందారు. మంగీలాల్‌ మహబూబ్‌నగర్‌ నుండి నగరానికి వలసవచ్చి చర్లపల్లిలో ఉంటున్నాడు. మహారాష్ట్రకు చెందిన సురేఖ కుటుంబంతో కలిసి నగరానికి వలసవచ్చి చర్లపల్లిలో నివాసముంటూ జీవిస్తుంది. ఈ ప్రమాదంలో మరో 11 మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక్కసారిగా వాహనం పల్టీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న కూలీలు చెల్లాచెదురుగా పడిపోయారు. ఘటనతో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కొద్దిసేపు కలకలం నెలకొంది. సమాచారం అందుకున్న కీసర పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి టైరు పేలడమే కారణమా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కీసర పోలీసులు తెలిపారు. పొట్టకూటి కోసం పనికి వెళ్తున్న కూలీల ప్రయాణం విషాదంగా మారడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.