PRABANJANAM
Date of Publish : 01 September 2026, 10:39 am Posted by : Prabanjanam News

నోటీసులు ఇచ్చాం.. మా పని అయిపోయింది.! శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల ప్రేక్షక పాత్ర

  • కబ్జాలు జరిగితే మేమేం చేయలేం
  • శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల ప్రేక్షక పాత్ర
  • ప్రభుత్వ భూమి అంటూ ఫ్లెక్సీలు పెట్టడమే వారి పని
  • నిర్మాణాలు సాగుతున్నా పట్టించుకోరు..
  • రెండో అంతస్తు ఉన్నప్పుడు ఫ్లెక్సీ ఏర్పాటు.. 6అంతస్తులు ఎలా సాగాయి..?
  • అధికారుల ప్రేక్షక పాత్రకు అర్థం ఏమిటి..?
  • శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

తెలంగాణ బ్యూరో( ప్రభంజనం ): శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల పనితీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రభుత్వ స్థలాల కబ్జాలను అరికట్టడం మా పని కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా పదే పదే ఫిర్యాదులు చేస్తే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అదేంటి అంటే పెద్దసార్ ను అడగాలంటూ ఉచిత సలహాలు ఇవ్వడం ఆర్ఐలకు పరిపాటిగా మారింది. వారికింద ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని క్షేత్రస్థాయిలో సమాచారాన్ని తెప్పించుకుంటున్న ఆర్ఐలు.. కబ్జాల విషయంలో ఎందుకు కామూష్ గా ఉంటున్నారు, ఏ ప్రయోజనాలకోసం అనేది వారికే తెలియాలి.

ప్రభుత్వ స్థలంలో 6 అంతస్థుల మేడ..

శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 59లో 57.09 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. అయితే అందులో ఆర్టీఏ ఆఫీసు, భిక్షపతి యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అర్హులైన కొందరికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. మిగతా స్థలం ఖాళీగానే ఉంది. పక్కనే ఉన్న స్థల యజమానులు నిర్మాణం చేపట్టారు. స్థలంలో వారు కట్టుకుంటే ఆడిగేవారేవరూ ఉండరు. కానీ పక్కనే ఉన్న సర్కార్ స్థలంలోకి వచ్చి 337.19 గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. ఇదే స్థలానికి ఘనతా వహించిన జీహెచ్ఎంసీ ( సీఎంసీ ) అధికారులు అనుమతులు మంజూరు చేశారు. సర్కార్ స్థలం కబ్జాపై శేరిలింగంపల్లి తహశీల్దార్ మహిపాల్ రెడ్డిని ప్రశ్నిస్తే.. 1-05-2026న ల్యాండ్ ఎంక్రోచ్ యాక్ట్ కింద కబ్జాదారులకు నోటీసులు జారీచేశామని తెలిపారు. వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు. కానీ ఏం జరిగిందో కానీ నిర్మాణం ఆగలేదు. 5వ నెలలో నోటీసులు ఇస్తే 9వ నెలలోకి అడుగుపెట్టినా

రెవెన్యూ అధికారులు ఎందుకో చర్యలు తీసుకోలేదు. అప్పుడు 2 అంతస్తులు ఉన్న భవనం ఇప్పుడు 6అంతస్థులకు చేరింది. ఇంత బరితెగించి నిర్మాణం సాగుతుంటే రెవెన్యూ అధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనేది వారికే తెలియాలి.

హైడ్రా ఇటువైపు చూడదా..

ప్రభుత్వ స్థలాలు కబ్జాలు జరుగుతున్నాయి అంటేనే పెద్ద పెద్ద బుల్డోజర్లతో వాలిపోయే హైడ్రా ఎందుకో కొండాపూర్ సర్వే నెంబర్ 59 వైపు కన్నెత్తి చూడలేదు. కబ్జాలు జరుగుతున్నాయి చర్యలు తీసుకోండి అంటూ లేఖలు రాసే శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఎందుకో ఈ 337 గజాల స్థలంపై హైడ్రాకు లేఖ రాయలేదు. దీని వెనక ఎవరున్నారు. అంతలా అధికారులను అడ్డుకుంటున్నది ఎవరన్నది చర్చనీయాంశంగా మారుతుంది.

సమాచారం ఇవ్వండి అంటే.. మీకెందుకు అంటున్న తహశీల్దార్..

సర్వే నెంబర్ 59కు సంబంధించి భూ విస్తీర్ణం, అందులో ఎవరెవరికి కేటాయింపులు జరిగాయి అనే వివరాలు కావాలంటూ ఇటీవల ఓ బీజేపీ నాయకుడు శేరిలింగంపల్లి తహశీల్దార్ మహిపాల్ రెడ్డిని కలిసి కోరాడు. ఆ వివరాలు మీకెందుకు ఇవ్వాలి. మీరు వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తారా..? అయినా ప్రభుత్వ భూములతో మీకేం పని అంటూ కాస్త గట్టిగానే ఆయనపై మండిపడ్డాడట. ప్రభుత్వ భూముల కబ్జాలపై అడిగితే స్వయంగా తహశీల్దార్ అంతమాట అన్నాడు అంటూ ఆ లీడర్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు, మీడియానే కాదు ఎవరు ఏ సమాచారం అడిగినా కాదు, లేదు నోటీసులు జరీచేశాం అంటూ దాటవేత సమాధానాలు చెప్పి విషయాలపై మౌనం పాటించడం శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులకు పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.