PRABANJANAM
Date of Publish : 28 July 2026, 4:25 pm Posted by : Prabanjanam News

స్టింగ్, రెడ్‌బుల్‌కు షాక్.. ‘ఎనర్జీ డ్రింక్’ పదం వాడొద్దని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు

  • ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్‌ను తొలగించాలని కంపెనీలకు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ఆదేశం
  • పెప్సీ, రెడ్ బుల్, మాన్‌స్టర్‌కు నిబంధనలు పాటించేందుకు 90 రోజుల గడువు
  • ‘శరీరానికి ఉత్తేజం’ వంటి ప్రకటనలు తప్పుదారి పట్టించేవిగా గుర్తింపు
  • భారత్‌లో ‘ఎనర్జీ డ్రింక్స్’కు అధికారిక ప్రమాణాలు లేవన్న నియంత్రణ సంస్థ
అధిక కెఫిన్ కలిగిన పానీయాలను ‘ఎనర్జీ డ్రింక్స్’గా ప్రచారం చేయవద్దని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. పెప్సీ, రెడ్ బుల్, మాన్‌స్టర్ బెవరేజ్, రిలయన్స్, హెల్ ఎనర్జీ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల లేబుళ్ల నుంచి ‘ఎనర్జీ డ్రింక్’ అనే పదాన్ని, దానికి సంబంధించిన వర్ణనలను 90 రోజుల్లోగా తొలగించాలని స్పష్టం చేసింది.

భారత్‌లో ‘ఎనర్జీ డ్రింక్స్’ పేరిట విక్రయిస్తున్న ఉత్పత్తులకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రమాణాలు లేవని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. ‘శరీరానికి, మనసుకు ఉత్తేజాన్ని ఇస్తుంది’ లేదా ‘శారీరక బలహీనతను తగ్గిస్తుంది’ వంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. బ్రాండింగ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలతో గతంలోనే రెడ్ బుల్, పెప్సీకోకు చెందిన స్టింగ్, రిలయన్స్ క్యాంపా ఎనర్జీ వంటి బ్రాండ్‌లకు సంస్థ నోటీసులు జారీ చేసింది.

ఇటీవల పరిశ్రమ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈఓ రజిత్ పున్హానీ ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. ఈ క్రమంలో నిబంధనలకు కట్టుబడి ఉంటామని కంపెనీలు అంగీకరించడంతో, లేబుళ్లు మార్పునకు సంబంధించి ప్రభుత్వం 90 రోజుల గడువు ఇచ్చింది.

దేశీయంగా ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా 2017లో పెప్సీ కంపెనీ తక్కువ ధరకే ‘స్టింగ్’ బ్రాండ్‌ను పరిచయం చేయడంతో యువతలోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటికి ఆదరణ గణనీయంగా పెరిగింది. యూరోమానిటర్ అంచనాల ప్రకారం, 2028 నాటికి భారత ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్ విలువ 1.6 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది.