- భిక్షాటన చేసిన మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే
- తన అనుభవాలను వెల్లడించిన పరాగ్ షా
ముంబై: ( ప్రభంజనం )
సాధారణంగా ఎమ్మెల్యే అంటే భద్రతా సిబ్బంది, కాన్వాయ్, అధికారిక హోదా, ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు కనిపిస్తాయి. అయితే మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా మాత్రం ఇవన్నీ పక్కనపెట్టి ఓ రోజు సాధారణ బిచ్చగాడి వేషంలో ముంబై వీధుల్లో కనిపించారు. ఘాట్‌కోపర్ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ, రోడ్డు పక్కన కూర్చుంటూ, ప్రజల నుంచి ఆహారం, డబ్బు స్వీకరిస్తున్న ఆయన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పరాగ్ షా ముంబైలోని ఘాట్‌కోపర్ ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన ఆయన భారీగా సంపాదించాడు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన ఆస్తుల వివరాల ఆధారంగా ఆయనను దేశంలోని అత్యంత సంపన్న రాజకీయ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎన్నికల అఫిడవిట్ లో ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ సుమారు రూ.3,383 కోట్లు. అంతటి ఆర్థిక స్థోమత ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా బిచ్చగాడి వేషంలో రోడ్డుపై కనిపించడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
అసలు ఎందుకు భిక్షాటన చేశారు?
ఇది రాజకీయ నిరసనలో భాగంగా చేసిన కార్యక్రమం కాదు. తన జైన ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన సూచనతో ఈ అనుభవాన్ని స్వీకరించినట్లు పరాగ్ షా స్వయంగా వెల్లడించారు. జైన సంప్రదాయంలోని పర్యుషణ్ పర్వదినాల సందర్భంగా వినయం, ఆత్మపరిశీలన, త్యాగం వంటి విలువలను అనుభవంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.. తన సాధారణ హోదా, భద్రతా సిబ్బంది, వాహనాలు, ఖరీదైన వస్తువులను పక్కనపెట్టి బిచ్చగాడి వేషంలో ఘాట్‌కోపర్ వీధుల్లోకి వెళ్లారు. వేషం మార్చుకోవడంతో రోడ్డుపై ఉన్న ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా గుర్తించలేదు. సాధారణంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తనను కలవడానికి ప్రజలు వస్తారని, తనకు ప్రత్యేక గౌరవం లభిస్తుందని పరాగ్ షా చెప్పారు.
అయితే అదే వ్యక్తి ఎలాంటి హోదా, పరిచయం లేకుండా బిచ్చగాడి వేషంలో ప్రజల ముందుకు వెళ్లినప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆయన వివరించారు. కొందరు పట్టించుకోకుండా వెళ్లిపోగా, మరికొందరు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ అనుభవంలో తనను ఎక్కువగా ఆకట్టుకున్న ఘటనలను కూడా పరాగ్ షా వివరించారు. తనకు ఒక వ్యక్తి రూ.20 ఇచ్చి, బాబా, వెళ్లి భోజనం చేయండి అన్నట్లు ఆయన చెప్పారు. మరోవైపు, ఓ సమోసా విక్రేత తన వద్ద డబ్బు లేదని తెలిసినా సమోసా ఇచ్చాడని తెలిపారు. ఆ చిన్న వ్యాపారి చూపిన మానవత్వం తనను ఎంతో ప్రభావితం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ అనుభవం ద్వారా ముంబై ప్రజల్లోని మానవత్వాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని పరాగ్ షా చెప్పారు. తన మాటల్లో చెప్పాలంటే, ఆ రోజు తనకు సంపద కంటే మానవ సంబంధాలు, ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం ఎంత విలువైనవో మరింత స్పష్టంగా అర్థమైంది. పేదరికాన్ని బయట నుంచి చూడటం వేరు, కొంతసేపైనా ఆ పరిస్థితిని స్వయంగా అనుభవించడం వేరు అనే భావన తనకు కలిగిందని ఆయన వెల్లడించారు. పరాగ్ షా భిక్షాటన ఘటన రాజకీయ ప్రచార కార్యక్రమంగా కాకుండా వ్యక్తిగత, ఆధ్యాత్మిక అనుభవమని, ముఖ్యంగా పర్యుషణ్ పర్వం సందర్భంగా వినయం, త్యాగం, ఆత్మపరిశీలన వంటి అంశాలను అనుభవించాలనే ఉద్దేశంతోనే గురువు సూచనల మేరకు ఎమ్మెల్యే స్వయంగా బిచ్చగాడిగా ఒకరోజంతా గడిపారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఒకవైపు వేల కోట్ల ఆస్తులు, మరోవైపు రోడ్డుపై నిలబడి ప్రజల నుంచి సహాయం కోరిన ఎమ్మెల్యే పరాగ్ షా చేసిన ఈ ప్రయోగం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన హోదా, సంపద, రాజకీయ పలుకుబడిని పక్కనపెట్టి సాధారణ వ్యక్తిగా కొన్ని గంటలు గడపడం ద్వారా పేదరికం, సామాజిక గౌరవం, మానవత్వం, ఇతరుల సహాయం విలువ గురించి కొత్త అనుభవం పొందానని పరాగ్ షా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సంపద ఉన్నవాడు పేదవాడి జీవితాన్ని నిజంగా అర్థం చేసుకోగలడా? అనే చర్చ కూడా మొదలైంది. అయితే పరాగ్ షా ఉద్దేశం మాత్రం తన గురువు సూచన మేరకు వినయం, ఆత్మపరిశీలనను అనుభవించడమేనని ఆయన వివరణ ద్వారా స్పష్టమవుతోంది.