మిస్సైన రెండో మొబైల్‌పై పోలీసుల ఆరా!

క్రైమ్ బ్యూరో ( ప్రభంజనం ): మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఉప్పరపల్లి కోర్టు ఉత్తర్వుల మేరకు శుక్రవారం సాయంత్రం 5:30 గంటల వరకు ఈ కస్టడీ కొనసాగనుంది.
అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య నాయక్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది. డీసీపీ పర్యవేక్షణలో సీఐ జ్యోత్స్న ఉదయ్ కృష్ణారెడ్డిని విచారిస్తున్నారు.
రెండో మొబైల్‌పైనే ఫోకస్
ఈ విచారణలో భాగంగా పోలీసులు కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ప్రధానంగా ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన రెండో మొబైల్ ఫోన్ అడ్రస్‌పై పోలీసులు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఆ మిస్సైన రెండో మొబైల్ దొరికితే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే ఉదయ్‌కి సంబంధించిన ల్యాప్‌టాప్, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ( ఎఫ్ ఎస్ ఎల్ )కి పంపించారు
ఇదీ కేసు నేపథ్యం..
హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డిని గత నెల 28న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి లోతుగా విచారించేందుకు వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఉమెన్స్ సేఫ్టీవింగ్ అధికారులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో.. అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలితో పరిచయం, వేధింపుల ఉదంతం తదితర కీలక అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ కస్టడీ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.