కామారెడ్డి( ప్రభంజనం ): గర్భసంచి ఆపరేషన్ కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళ అనస్థీషియా ఇచ్చిన అనంతరం మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. లింగంపేట మండలానికి చెందిన రాజేశ్వరి (42) గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్ చికిత్స కోసం కామారెడ్డిలోని జీవదాన్ హాస్పిటల్‌లో చేరింది. ఆపరేషన్‌కు ముందు అనస్థీషియా ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొద్దిసేపటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.
ఈ ఘటనతో తీవ్ర ఆవేదనకు గురైన రాజేశ్వరి కుటుంబ సభ్యులు, బంధువులు జీవదాన్ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ కుటుంబ సభ్యురాలి మృతికి కారణాలపై స్పష్టత ఇవ్వాలని, ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. మృతురాలు రాజేశ్వరికి భర్త నరేందర్‌తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే రాజేశ్వరి మృతికి అనస్థీషియా ఇంజక్షన్ కారణమా, లేక ఇతర వైద్యపరమైన కారణాలున్నాయా అన్నది అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.