PRABANJANAM
Date of Publish : 14 September 2026, 6:02 pm Posted by : Prabanjanam News

కార్ల కాన్వాయ్‌లో గణనాథుడి గ్రాండ్ ఎంట్రీ..

  • జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన చిన్నవాల్గోట్

సిరికొండ : (ప్రభంజనం)

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చిన్నవాల్గోట్ గ్రామంలో గణనాథుడి ఆగమనం ఈసారి వినూత్నంగా నిర్వహించారు. శ్రీ రామసేనా విఘ్నహర్త మండలి రామసేన కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కార్లను సిద్ధం చేసి, వాటితో భారీ కాన్వాయ్‌గా వినాయకుడిని గ్రామంలోకి తీసుకువచ్చారు. జై శ్రీరామ్, జై రామ్ నినాదాలతో కార్ల కాన్వాయ్ ప్రధాన వీధుల గుండా ముందుకు సాగడంతో పండుగ వాతావరణం నెలకొంది.
వినాయకుడి ఊరేగింపు సందర్భంగా డప్పుల సప్పుళ్లతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు మంగళహారతులు పట్టుకుని గణనాథుడికి స్వాగతం పలికారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల నినాదాలు, డప్పుల మోత మధ్య వినాయకుడిని మండపం వద్దకు తీసుకువచ్చి ప్రతిష్ఠాపించారు.
వినూత్న రీతిలో కార్ల కాన్వాయ్‌తో గణనాథుడిని మండపానికి తీసుకురావడం గ్రామంలో ప్రత్యేకంగా నిలిచింది. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు రామసేన కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.