PRABANJANAM
Date of Publish : 08 August 2026, 10:16 am Posted by : Prabanjanam News

హైడ్రా ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోటీ

  • హైడ్రా ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోటీ
  • సరూర్‌నగర్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత..
  • భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు

ఎల్బీనగర్: ( ప్రభంజనం )

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడకపోవడంతో యువత రోడ్డున పడుతోంది. చివరికి చిన్న చిన్న ప్రైవేట్, తాత్కాలిక ఉద్యోగాల కోసం కూడా వేల సంఖ్యలో యువత పోటీపడుతున్న దయనీయ పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. తాజాగా దీనికి నిదర్శనంగా నిలిచిన ఘటనే హైడ్రా డ్రైవర్, డీఆర్‌ఎఫ్ ఉద్యోగాల ప్రకటన. హైడ్రా పరిధిలో మొత్తం 150 ఉద్యోగాల భర్తీ కోసం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 100 డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల ఎంపిక కోసం ఎల్బీ నగర్ లోని సరూర్‌నగర్ స్టేడియం వేదికగా ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచే ఈవెంట్స్ నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే, కేవలం 150 పోస్టుల కోసమే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు స్టేడియంకు భారీగా తరలివచ్చారు. ఒక్కసారిగా విపరీతమైన జనం పోగవడంతో స్టేడియం వద్ద తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, గుమిగూడిన యువతను చెదరగొట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో (నెట్టింట) వైరల్‌గా మారాయి. రాష్ట్రంలో ఉపాధి లేమికి, ఉద్యోగాల కోసం యువత పడుతున్న తపనకు ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందని నిరుద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.