PRABANJANAM
Date of Publish : 28 July 2026, 3:00 pm Posted by : Prabanjanam News

డీఎస్సీ అవకతవకలకు ఆస్కారమే లేదు.. అత్యాధునిక భద్రతపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇదిగో!

  • ఏపీ మెగా డీస్సీ-2025పై ఆరోపణలు
  • వివరణ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
  • మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గాను 15,941 మందికి నియామక పత్రాలు జారీ
  • టీసీఎస్ iON ప్లాట్‌ఫామ్‌పై పటిష్ఠ భద్రతతో కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణ
  • ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం, పారదర్శకతకు పెద్దపీట
  • రాష్ట్ర చరిత్రలోనే అత్యంత వేగవంతమైన, పారదర్శక నియామక ప్రక్రియగా వెల్లడి
మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక పరీక్షల ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను ఏపీలోని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత పకడ్బందీ చర్యలతో పరీక్షలు నిర్వహించామని స్పష్టం చేసింది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించామని, అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

లీక్‌కు ఆస్కారం లేని భద్రతా వ్యవస్థ
పరీక్షల నిర్వహణలో అనుసరించిన పటిష్ఠమైన భద్రతా విధానాలను ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన టీసీఎస్ అయాన్ (TCS iON) ప్లాట్‌ఫామ్‌ను ఈ పరీక్షల కోసం వినియోగించినట్టు తెలిపింది. సమాచార భద్రతకు అత్యున్నత ప్రామాణికమైన 256-బిట్ ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీతో ప్రశ్నపత్రాలను భద్రపరిచామని, దీనివల్ల డేటా లీక్ అయ్యే అవకాశమే లేదని స్పష్టం చేసింది. పరీక్ష రాసే ప్రతి అభ్యర్థికి 42 లక్షల ప్రశ్నల భారీ బ్యాంక్ నుంచి కంప్యూటర్ ద్వారా యాదృచ్ఛికంగా (Random Shuffling) ప్రశ్నలు వస్తాయని, ఒక అభ్యర్థికి వచ్చిన ప్రశ్నపత్రం మరొకరికి రాదని వివరించింది. దీనివల్ల మాస్ కాపీయింగ్‌కు గానీ, ముందుగా ప్రశ్నలు తెలుసుకునేందుకు గానీ ఆస్కారం ఉండదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ప్రతి పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ హాజరు, వెబ్‌కాస్టింగ్, సీసీటీవీ నిఘా వంటి బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లు చేసి పరీక్షలు నిర్వహించామని పేర్కొంది. దరఖాస్తు స్వీకరణ నుంచి హాల్ టికెట్ల జారీ, ఆన్‌లైన్ పరీక్ష, ఫలితాల వెల్లడి, తుది ఎంపిక వరకు ప్రతి దశలోనూ పారదర్శకతకు పెద్దపీట వేశామని ప్రభుత్వం వివరించింది.

గత ప్రభుత్వ విధానాలపై విమర్శలు
ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ నియామకాలపై అనుసరించిన వైఖరిని ప్రస్తుత ప్రభుత్వం తప్పుబట్టింది. గత పాలకులు ‘మెగా డీఎస్సీ’ అంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసి, చివరికి ‘టెట్ కమ్ టీఆర్టీ’ పేరుతో నియామకాలు చేపట్టి అభ్యర్థులను గందరగోళానికి గురిచేశారని ఆరోపించింది. 2024 ఎన్నికల ముందు కేవలం 6,100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారని విమర్శించింది.

అయితే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్యను 16,347కు పెంచి, నిరుద్యోగ యువతకు అండగా నిలిచిందని గుర్తుచేసింది. గతంలో జరిగినట్లుగా అసంబద్ధ విధానాలకు, అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకునే చర్యలకు తమ పాలనలో తావులేదని స్పష్టం చేసింది.

అభ్యర్థులకు అండగా ఉంటాం
ఏళ్ల తరబడి కష్టపడి చదివి, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన అభ్యర్థుల శ్రమ వృథా కాదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రతిభ, నిబద్ధత, కఠోర శ్రమను నమ్ముకున్న వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని పేర్కొంది. కొందరు కావాలనే అవాస్తవ ప్రచారాలతో అభ్యర్థులను తప్పుదోవ పట్టించి, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వాటిని నమ్మవద్దని సూచించింది.

ఈ నియామక ప్రక్రియలో ఏ ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగదని, కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపికలు ఉంటాయని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి రాజీకి తావులేదని, ఈ విషయంలో తమ ప్రభుత్వ నిబద్ధతను ఎవరూ శంకించాల్సిన పనిలేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది.