- పెళ్లయిన 20 రోజులకే ఘోరం
- కళాశాల 3వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థిని
- చికిత్స పొందుతూ మృతి
ఘట్కేసర్, (ప్రభంజనం):
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీఆర్‌ఐటీ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం జరిగిన కేవలం 20 రోజులకే బీటెక్ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటెపల్లికి చెందిన ఏనుగు పల్లవి (బీటెక్ థర్డ్ ఇయర్) కి, చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డితో గత నెల 30న ప్రేమ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత సెప్టెంబర్ 17 నుంచి కళాశాలకు హాజరవుతున్న పల్లవి, శుక్రవారం సాయంత్రం కాలేజీ డి-బ్లాక్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం మేడిపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న ఘట్‌కేసర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.