PRABANJANAM
Date of Publish : 14 September 2026, 9:39 am Posted by : Prabanjanam News

పండగపూట పోచారంలో విషాదం..

  • వినాయక విగ్రహం కొనుగోలు వివాదంలో వ్యక్తి మృతి
  • మృతుడి బంధువుల ఆందోళన..
  • వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ధర్నా!

ఘట్కేసర్: (ప్రభంజనం)

వినాయక చవితి వేళ పోచారంలో విషాదఘటన చోటుచేసుకుంది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జోడిమెట్ల వద్ద వినాయక విగ్రహం కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదం కిరణ్ (24) వ్యక్తి ప్రాణాలను తీసింది. విగ్రహాల విక్రేతలకు, కొనుగోలుదారులకు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చౌదరిగూడకు చెందిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు చౌదరిగూడకు చెందిన బాధితుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడి పడిపోయిన అతడిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో బాధితుడు కిరణ్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కిరణ్ మృతి చెందాడన్న వార్త తెలియడంతో బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. న్యాయం చేయాలంటూ వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. దాడికి పాల్పడిన ఐదుగురిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రహదారిపై ధర్నాతో భారీగా ట్రాఫిక్ స్తంభించి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాధ్యులైన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.