- పుష్కరిణిలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
- దర్శనానికి వచ్చిన కుటుంబంలో తీరని శోకం
యాదగిరిగుట్ట (ప్రభంజనం): శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారి పుష్కరిణిలో పడి మృతి చెందింది. ఈ విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ పరిధిలోని బడంగ్‌పేటకు చెందిన ప్రవీణ్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో కల్యాణకట్ట సమీపంలోని పుష్కరిణిలో కుటుంబ సభ్యులు స్నానం చేస్తుండగా, వారి నాలుగేళ్ల కుమార్తె శివలింగం ఆద్య పుష్కరిణి మెట్ల వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయింది. చిన్నారికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు, ఇతరులు చిన్నారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై యాదగిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం చిన్నారి మృతదేహాన్ని తండ్రికి అప్పగించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.