PRABANJANAM
Date of Publish : 25 August 2026, 6:43 pm Posted by : Prabanjanam News

అధ్వానంగా ‘తాజా’ టిఫిన్స్… పొంగలిలో ప్రత్యక్షమైన పురుగులు

  • వినియోగదారుడి పొంగలిలో పురుగులు…
  • ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానాలు!
  • అపరిశుభ్రతకు నిలయంగా ఘట్‌కేసర్ జాతీయ రహదారి హోటళ్ళు
  • ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి:బాధితులు డిమాండ్

ఘట్కేసర్ (ప్రభంజనం): “తాజా” అనే పేరును చూసి మోసపోకండి! జోడిమెట్లలోని ‘తాజా టిఫిన్స్’ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో బహిరంగంగా చెలగాటమాడుతోంది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ హోటల్‌లో కనీస పరిశుభ్రత లేకపోగా.. నాణ్యతా ప్రమాణాలు కరువయ్యాయి. శుచి, శుభ్రతలేని ఆహారాన్ని వడ్డిస్తూ కస్టమర్ల ప్రాణాలతో చలగాటమాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్, పోచారం 7వ డివిజన్ పరిధిలోని “తాజా టిఫిన్స్” హోటల్‌కు స్థానికుడు శ్యాంసన్ తన కుటుంబంతో కలిసి వెళ్లారు. తినేందుకు పొంగలి ఆర్డర్ చేశారు. ఆర్డర్ తీసుకుని తినేందుకు ప్రయత్నించగా అందులో పురుగులు తేలడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్లేటులో పురుగులను చూపిస్తూ హోటల్ నిర్వాహకులను, సిబ్బందిని నిలదీయగా… వారు తమ తప్పిదాన్ని ఒప్పుకోకపోగా, బాధ్యతారహితంగా మాట్లాడుతూ పొంతన లేని సమాధానాలతో వినియోగదారులతో దురహంకారం ప్రదర్శించారు.

హోటల్ లోపల ఆహార పదార్థాల తయారీ తీరు అత్యంత అసహ్యకరంగా ఉందని, టిఫిన్ పిండి, చట్నీలు, కర్రీస్‌పై ఎలాంటి మూతలు లేకుండా బహిరంగంగా వదిలేస్తున్నారని బాధితులు తెలిపారు. నాణ్యత లేని దినుసులు వాడుతూ, ఈగలు వాలుతున్న పదార్థాలనే కస్టమర్లకు వడ్డిస్తూ హోటల్ నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం పేరుకే ‘తాజా’ అని పేరు పెట్టి, రోగాలను పంచుతున్న ఇలాంటి నిర్లక్ష్యపు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్యాంసన్ తో పాటు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఓవైపు నగర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా.. పురుగుల ఆహారం సరఫరా చేస్తున్న తాజా హోటల్‌ను సీజ్ చేసి, నిర్వాహకులపై కేసు నమోదు చేయకపోతే భవిష్యత్తులో ప్రజల ప్రాణాలకే ప్రమాదమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.