కామారెడ్డి ప్రతినిధి (ప్రభంజనం): కామారెడ్డి జిల్లాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లు, క్రిమినల్ బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీషీటర్ కాట్యాడ బాపురావు అలియాస్ బాపురావు పై తెలంగాణ ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం–1986 (పీడీ యాక్ట్ ) కింద జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ సంగ్వాన్ డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు గతంలో కూడా పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉండగా, ఇటీవల దేవన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన దోపిడీ కేసు, గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు ఎక్స్‌టార్షన్, క్రిమినల్ బెదిరింపుల కేసుల్లో అతడు కీలక నిందితుడుగా ఉన్నాడు. ప్రజలను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, జర్నలిస్టు పేరుతో భయాందోళనలు సృష్టించడం, దోపిడీలకు పాల్పడినటువంటి వంటి చర్యలతో ప్రజా శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించినందున అతనిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. ప్రస్తుతం నిందితుడు న్యాయపరమైన నిర్బంధంలో ఉండగా, జిల్లా కలెక్టర్ జారీ చేసిన డిటెన్షన్ ఉత్తర్వులను సంబంధిత అధికారులు నిజామాబాద్ సెంట్రల్ జైలులో అందజేశారు.జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. ప్రజల్లో భయం, అభద్రత సృష్టించే దోపిడీలు, బలవంతపు వసూళ్లు, క్రిమినల్ బెదిరింపులు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే వ్యక్తులపై సాధారణ చట్టాలతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్‌ను కూడా కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రజాశాంతి, భద్రతలకు విఘాతం కలిగించే సంఘవ్యతిరేక శక్తులపై కామారెడ్డి జిల్లా పోలీసులు ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగిస్తారని స్పష్టం చేశారు.


