- సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసనలు
- ‘బాకీ కార్డుల’ పంపిణీతో ప్రజల్లోకి గులాబీ శ్రేణులు
- పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్‌లో కార్యాచరణ వెల్లడి
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ అసమర్థ పాలనను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ ప్రత్యేక పోరాట కార్యాచరణను ఆయన దిశానిర్దేశం చేశారు.
చార్జిషీట్‌తో ప్రారంభం.. ప్రత్యేక కార్యక్రమాలు
సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అధికారికంగా చార్జిషీట్ విడుదల చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 2 నుంచి వరుసగా ఏడు రోజుల పాటు రోజువారీ కార్యక్రమాలను ప్రకటించారు.
సెప్టెంబర్ 2 (ఆరు గ్యారెంటీల వైఫల్యం): నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, భారీ ఫ్లెక్సీల ప్రదర్శన. ప్రజలకు ప్రభుత్వం బాకీ ఉన్న హామీలను వివరిస్తూ ఇంటింటికీ ‘బాకీ కార్డుల’ పంపిణీ.
సెప్టెంబర్ 3 (రైతాంగ పోరు): వ్యవసాయ విధ్వంసంపై రైతు సదస్సులు. సాగునీరు, విద్య్త్, యూరియా, పంటల బీమా సమస్యలపై చర్చ. హైదరాబాద్‌లో 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యలపై నిరసనలు.
సెప్టెంబర్ 4 (మహిళా నిరసనలు): మహిళలు, వికలాంగులతో ప్రత్యేక సదస్సులు. రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అమలుపై నిలదీత. వినూత్నంగా ‘వంటావార్పు’ కార్యక్రమాలు.
సెప్టెంబర్ 5 (యువజన గళం): విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీలు. ఫీజు రీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్‌పై పోరాటం. ఆదిలాబాద్, సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక సదస్సులు.
సెప్టెంబర్ 6 (నగర, పల్లె సమస్యలు): హైదరాబాద్‌లో ఆటోలతో భారీ ర్యాలీ. తాగునీరు, వీధిదీపాలు, ట్రాఫిక్, శాంతిభద్రతలపై ప్రభుత్వాన్ని నిలదీయడం. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలపై నిరసనలు.
సెప్టెంబర్ 7 (ప్రజావాణి ఫిర్యాదులు): జిల్లా, మండల ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ మోసంపై వినతిపత్రాలు, ఫిర్యాదుల అందజేత.
సెప్టెంబర్ 8 (సమీక్షా ప్రెస్మీట్లు): అన్ని జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు.
సెప్టెంబర్ 10: ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నిరసనలకు బీఆర్ఎస్ పూర్తి సంఘీభావం.
ఈ కార్యక్రమాలను కేవలం మొక్కుబడిగా కాకుండా, ప్రతి నాయకుడు బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ మోసాలను ప్రతి ఇంటికీ చేరవేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.


