
శేరిలింగంపల్లి ( ప్రభంజనం): ఆల్విన్ కాలనీ డివిజన్‌లోని టైగర్ ఆలే నరేంద్ర పార్కు అపరిశుభ్రతకు నిలయంగా మారిందని న్యాయవాది లంగటి నరేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.పార్కులో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయి మురికికూపంగా మారిందన్నారు. మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసినప్పటికీ సరైన నిర్వహణ లేక అవి అపరిశుభ్రంగా మారి దుర్వాసన వెదజల్లుతున్నాయని పేర్కొన్నారు. పనికిరాని వస్తువులు, ఇతర వ్యర్థాలను సైతం పార్కులోనే ఉంచడం బాధాకరమన్నారు. పార్కులను పరిశుభ్రంగా ఉంచాల్సిన సీఎంసీ శానిటేషన్ సిబ్బంది, అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వెంటనే అధికారులు స్పందించి అపరిశుభ్రంగా ఉన్న మొబైల్ టాయిలెట్లను తొలగించడంతో పాటు పార్కులోని చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.


