ఇంటర్నేషనల్ డెస్క్ ( ప్రభంజనం ) :బంగ్లాదేశ్ తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో రోజుకు 9 నుంచి 10 గంటల వరకు విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు నగరాల్లోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ సుమారు 18,000 మెగావాట్లుగా ఉండగా, ఉత్పత్తి 13,000 మెగావాట్లకు కూడా చేరడం లేదని సమాచారం. మరోవైపు దేశంలో తీవ్ర ఎండలు, ఉక్కపోత కొనసాగుతున్న సమయంలో విద్యుత్ కోతలు ప్రజల ఇబ్బందులను మరింత పెంచుతున్నాయి. విద్యుత్ కోతలపై ఆగ్రహంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు స్థానిక విద్యుత్ పంపిణీ కేంద్రాలు, అధికారులపై దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. దీంతో పవర్ స్టేషన్ల వద్ద భద్రత కల్పించాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. విద్యుత్ కొరతను అధిగమించేందుకు పరిశ్రమలకు సరఫరాను తగ్గించడంతోపాటు, ఢాకాతో సహా పలు నగరాల్లో షాపులు, వాణిజ్య సంస్థలు, షాపింగ్ మాల్స్‌ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసంక్షోభ ప్రభావం రైతులపైనా తీవ్రంగా పడుతోంది. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో వ్యవసాయ రంగంతో పాటు వ్యాపార, పారిశ్రామిక రంగాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
చమురు కొరతే ప్రధాన కారణం
బంగ్లాదేశ్‌లో విద్యుత్ సంక్షోభానికి ప్రధాన కారణాల్లో చమురు కొరత ఒకటిగా తెలుస్తోంది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఇంధనం తగినంతగా అందుబాటులో లేకపోవడంతో పలు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. బంగ్లాదేశ్ తన చమురు అవసరాల్లో సుమారు 90 శాతం, గ్యాస్ అవసరాల్లో 30 శాతం వరకు దిగుమతులపై ఆధారపడుతుంది. విదేశాల నుంచి తగినంత చమురు సరఫరా కాకపోవడంతో ఇంధన కొరత ఏర్పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంక్షోభం నుంచి బయటపడేందుకు బంగ్లాదేశ్ భారత్ సాయం కోరింది. రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, గతంలో కూడా భారత్ బంగ్లాదేశ్‌కు డీజిల్ సరఫరా చేసింది. తాజా డీజిల్ అభ్యర్థనపై భారత్ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.


