కళ్లలో కారం చల్లి, కర్రలతో విచక్షణారహితంగా దాడి
చనిపోయాడని భావించి కంపచెట్లలో పడేసిన వైనం
నలుగురి పేర్లు వెల్లడిస్తూ బాధితుడి వీడియో విడుదల
పరిస్థితి విషమం.. హైదరాబాద్‌కు తరలింపు
మహబూబ్ నగర్ బ్యూరో,( ప్రభంజనం ) :
నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. గురువారం తెల్లవారుజామున మార్నింగ్ వాక్‌కు వెళ్లిన బీఆర్ఎస్ మండల నాయకుడు భాస్కర్‌రెడ్డిపై దుండగులు అత్యంత పాశవికంగా దాడికి పాల్పడ్డారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగినట్లు బాధిత వర్గీయులు ఆరోపిస్తున్నారు. తీగలపల్లికి చెందిన భాస్కర్‌రెడ్డి రోజువారీలాగే గురువారం తెల్లవారుజామున బావాయిపల్లి రోడ్డు వైపు మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అప్పటికే అక్కడ మాటువేసిన నలుగురు వ్యక్తులు వెనుక నుంచి వచ్చి ఆయన కళ్లలో కారం చల్లారు. అనంతరం కర్రలతో తల, చేతులు, కాళ్లపై విచక్షణారహితంగా కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడి కింద పడిపోయినట్లు, భాస్కర్ రెడ్డి చనిపోయాడని భావించిన దుండగులు, ఆయనను రోడ్డు పక్కనున్న కంపచెట్లలోకి లాక్కెళ్లి పడేసి అక్కడి నుంచి పరారైనట్లు గ్రామస్తులు ఆరోపించారు. అదే సమయంలో ఆ దారిన వెళ్తున్న బావాయిపల్లి గ్రామస్థులు కంపచెట్లలో పడి ఉన్న భాస్కర్‌రెడ్డిని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని, ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు 108 అంబులెన్స్‌లో ఆయనను నాగర్‌కర్నూల్ ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే, తలకు తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాస్కర్‌రెడ్డి దాడికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. గుర్వయ్య పెద్ద బిచ్చయ్య, తెలుగు బాలచంద్రయ్య, వీరభద్రయ్య, ఆంజనేయులు అనే వ్యక్తులు వచ్చి తన కళ్లలో కారం కొట్టి, కట్టెలతో దాడి చేశారని బాధితుడు ఆ వీడియోలో ఆరోపించారు. పాత కక్షల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడి వర్గీయులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న కోడేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ దాడికి గల అసలు కారణాలు, వీడియోలో పేర్కొన్న వ్యక్తుల పాత్రపైన విచారణలో తేలాల్సి ఉంది.


