- పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
పాపన్నపేట, (ప్రభంజనం):
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత ఆలయ సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా గురువారం రాత్రి ఆకాశ కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పాండురంగ స్వామి అలంకరణతో దీపోత్సవ ఏర్పాట్లు చేసి, ఆలయ పూజారులు పార్థివ శర్మ, శంకర్ శర్మలు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. మంజీరా నదీ తీరాన వెలసిన అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈ వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో మట్టి ప్రమిదలను వెలిగించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపాల కాంతులతో ఆలయ ప్రాంగణమంతా దేదీప్యమానంగా వెలిగిపోయింది.
వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల దుర్గా నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తులు జై దుర్గామాత నినాదాలతో ఉత్సవంలో పాల్గొన్నారు. ఆలయ గోపురం వద్ద ప్రత్యేక ధ్వజస్తంభంపై అర్చకులు ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా వెలిగించి పైకి ఎగురవేశారు. లోకకల్యాణం, ప్రజల సుఖశాంతులను ఆకాంక్షిస్తూ ఈ ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


