Monday, November 30, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeభక్తివన దుర్గమ్మ సన్నిధిలో దర్శనానికి వివక్ష..

వన దుర్గమ్మ సన్నిధిలో దర్శనానికి వివక్ష..

📰 Generate e-Paper Clip

  • ఏడుపాయాల్లో ఖద్దరు నేతలకు రాజమర్యాదలు..
  • సామాన్య భక్తులకు గంటల తరబడి నిరీక్షణ
  • ప్రోటోకాల్ పేరుతో ప్రత్యేక దర్శనాలు..
  • క్యూలైన్లలో భక్తుల అవస్థలు
  • ఆలయ అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

పాపన్నపేట, (ప్రభంజనం):

దేవుళ్ల ముందు అందరూ సమానమే.. అమ్మవారి సన్నిధిలో అంతరాలు ఉండకూడదు. కానీ ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి సామాన్య భక్తులు అవస్థలు పడుతుంటే, రాజకీయ పలుకుబడి, అధికారం ఉన్నవారికి మాత్రం ప్రత్యేక మర్యాదలు, నేరుగా దర్శనాల ఏర్పాట్లు చేస్తున్నారనే ఆరోపణలు ఆలయ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. భక్తుల సౌకర్యాల కంటే వీఐపీల సేవలకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ భక్తజనం మండిపడుతున్నారు.

సామాన్య భక్తులకు తప్పని నిరీక్షణ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ మాత ఆలయానికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం వ్యయప్రయాసలకోర్చి వచ్చే భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోందని వాపోతున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దర్శన సమయాల్లో రద్దీని నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఖద్దరు నేతలకు ప్రత్యేక ప్రాధాన్యం!

రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు ఆలయానికి చేరుకుంటే మాత్రం అధికారుల హడావుడి మొదలవుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. సాధారణ క్యూలైన్లతో సంబంధం లేకుండా ప్రత్యేక మార్గాల్లో దర్శనానికి తీసుకెళ్తున్నారని, కొందరికి గర్భగుడి వరకు ప్రత్యేక అనుమతులు కల్పిస్తున్నారని చెబుతున్నారు. సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండగా, పలుకుబడి ఉన్నవారికి క్షణాల్లో దర్శనం కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

ప్రోటోకాల్ పేరుతో దర్శనాల నిలిపివేత

వీఐపీల రాక సందర్భంగా ప్రోటోకాల్ పేరుతో సాధారణ భక్తుల దర్శనాలను నిలిపివేయడం లేదా ఆలస్యం చేయడం భక్తుల్లో ఆగ్రహానికి దారితీస్తోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులను నిరీక్షింపజేసి, రాజకీయ ప్రముఖులకు ప్రాధాన్యత ఇవ్వడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు, అధికారం, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే దర్శనం సులభమా? అంటూ నిలదీస్తున్నారు.

సిబ్బంది వ్యవహారశైలిపైనా అసంతృప్తి

క్యూలైన్లలో ఉన్న సామాన్య భక్తుల పట్ల ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు సామాన్య భక్తులపై ఆంక్షలు, మరోవైపు వీఐపీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్న తీరు ఆలయంలో అమ్మవారి వద్ద అందరూ సమానమనే భావనకు విరుద్ధంగా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెరుగైన ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు, ప్రత్యేక దర్శనాల నిర్వహణకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఉన్నతాధికారులు స్పందించాలి

దేవాలయం అందరిదీ.. అమ్మవారి దర్శనం ప్రతి భక్తుడి హక్కు. వీఐపీ సంస్కృతి పేరుతో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగించడాన్ని నిలువరించాలని భక్తజనం డిమాండ్ చేస్తున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించాలని, క్యూలైన్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, ప్రోటోకాల్ అమలులో సామాన్య భక్తుల దర్శనాలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏడుపాయల ఆలయంలో వివక్షకు తావులేకుండా అందరికీ సమాన దర్శన అవకాశాలు కల్పించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.