- అది చట్టరీత్యా తీవ్రమైన నేరం
- నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
- బాలికలు ఉన్నత చదువులతో ఆర్థికంగా ఎదగాలి
- జిల్లాలో ఈ ఏడాది 35 బాల్య వివాహాలను అడ్డుకున్నాం
- వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
మహబూబ్ నగర్ బ్యూరో, ( ప్రభంజనం ):
- బాల్య వివాహాలు సమాజానికి మాయని మచ్చ మాత్రమే కాకుండా చట్టరీత్యా తీవ్రమైన నేరమని, వీటి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని బుద్ధారం గ్రామంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో అంతర్జాతీయ బాల్య, బలవంతపు వివాహాల నిర్మూలన దినోత్సవం, ప్రపంచ బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, ఆర్‌డీఎస్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 18 ఏళ్లు నిండని బాలికలకు, 21 ఏళ్లు నిండని బాలురకు వివాహం చేయడం చట్టవిరుద్ధమని కలెక్టర్ స్పష్టం చేశారు. బాల్య వివాహాలకు పాల్పడే వారితో పాటు వాటికి సహకరించే తల్లిదండ్రులు, వివాహ నిర్వాహకులు, పురోహితులు, ఫొటోగ్రాఫర్లపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల బాలికల చదువు మధ్యలోనే ఆగిపోవడమే కాకుండా రక్తహీనత, తల్లీబిడ్డల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. బాలికలు డాక్టర్లు, ఇంజినీర్లు, ఉన్నతాధికారులుగా ఎదిగేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని సూచించారు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం కూడా నేరమేనని గుర్తు చేశారు. జిల్లాలో అధికారుల సమన్వయంతో ఈ ఏడాది ఇప్పటివరకు 35 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రతి గ్రామ పంచాయతీలోని బాలల పరిరక్షణ కమిటీలు సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు, బాల కార్మికత్వం వంటి సమస్యలు ఎదురైతే భయపడకుండా చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న నాణ్యమైన విద్య, వసతి సదుపాయాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో బాల్య వివాహాల నిర్మూలనపై కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహ ముక్త్ భారత్ పోస్టర్లు, సెల్ఫీ స్టాండ్, సంతకాల సేకరణ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్ నాయక్, జిల్లా సంక్షేమ అధికారి కె. సుధారాణి, డీసీపీఓ రాంబాబు, ఆర్‌డీఎస్ ప్రతినిధి చిన్నమ్మ థామస్, ఇతర జిల్లా అధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


