Wednesday, September 9, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaCyberabad: ఖాకీ యూనిఫామ్ చాటున కష్టాలు..! పోలీసు శాఖలో హోం గార్డుల దుస్థితి..

Cyberabad: ఖాకీ యూనిఫామ్ చాటున కష్టాలు..! పోలీసు శాఖలో హోం గార్డుల దుస్థితి..

📰 Generate e-Paper Clip

  • విధులు కేటాయించకుండా పక్కన పెడుతున్న అధికారులు..
  • సిబ్బంది కొరత పేరుతో ఇతర పనులకు వినియోగం
  • పోలీసులకు సహాయకులుగా నియమితులైన హోంగార్డులు..
  • వ్యక్తిగత పనులకు ఉపయోగిస్తున్నారంటూ ఆవేదన
  • లాఠీ ఉండాల్సిన చేతుల్లో.. గార్డెనింగ్ పనిముట్లా?
  • డ్యూటీ రోస్టర్ ఎక్కడ? ఎవరి ఆదేశాలతో ఏ పనులు?
  • విధులు లేక ఎదురుచూపులు..
  • ఉన్నతాధికారుల నివాసాల వద్ద పనులు
  • ఆర్డర్లీ వ్యవస్థ ఉన్నట్టా.. లేనట్టా..

క్రైమ్ బ్యూరో ( ప్రభంజనం ): పోలీసు శాఖలో హోం గార్డులు అంటే.. పోలీసులకు సహాయకులుగా నిలిచే బలగం. శాంతిభద్రతల విధులు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, అత్యవసర సేవలు.. ఇలా పోలీసు వ్యవస్థకు అవసరమైన చోట తమ సేవలను అందించడం వారి ప్రధాన బాధ్యత. కానీ కొందరి విషయంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పోలీసు విధులు చేయాల్సిన హోం గార్డులతో అసలు ఎలాంటి పనులు చేయిస్తున్నారు? వారికి విధులు ఎవరు కేటాయిస్తున్నారు? ఆ డ్యూటీలకు అధికారిక రికార్డు ఉందా? ఉన్నతాధికారుల నివాసాల వద్ద వారు ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు?అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేవనే ఆరోపణలే ఈ వ్యవహారంలో అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.

డ్యూటీ కోసం వచ్చిన వారికి.. మరో పని

పోలీసు శాఖలో విధులు నిర్వర్తించేందుకు హోం గార్డుగా చేరిన వ్యక్తికి.. తనను ఎక్కడ, ఏ విధులకు కేటాయించారన్నది సాధారణంగా అధికారిక రికార్డుల్లో ఉండాలి. కానీ కొందరు హోం గార్డుల వాదన ప్రకారం.. తమను పోలీసు విధులకు కాకుండా ఉన్నతాధికారుల నివాసాల వద్ద ఇతర పనులకు పంపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇళ్ల పరిసరాల నిర్వహణ, మొక్కలకు నీళ్లు పోయడం, తోట పనులు, శుభ్రత వంటి పనులు కూడా చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోం గార్డులను వ్యక్తిగత పనులకు పంపుతున్నట్లయితే ఆ ఆదేశాలు ఎవరివి? అవి లిఖితపూర్వకమా? మౌఖికమా? డ్యూటీ రోస్టర్‌లో ఆ పని ఎలా నమోదు చేస్తున్నారు? అనేది వెల్లడి కావాల్సి ఉంది.

ఒకవేళ అధికారిక రికార్డుల్లో ఒక విధి చూపించి, వాస్తవంగా మరో పని చేయిస్తున్నట్లయితే.. అది పరిపాలనా పారదర్శకతపై ప్రశ్నలను లేవనెత్తుతుంది.డ్యూటీ రోస్టర్‌లు, హాజరు రిజిస్టర్లు, విధుల కేటాయింపు ఆదేశాలు, సంబంధిత అధికారుల ఆదేశాల రికార్డుల్లో ఈ విషయంపై స్పష్టత రానుంది.

విధులు లేక.. నిరీక్షణలో

మరోవైపు కొందరు హోం గార్డులకు సరైన విధులు కేటాయించకపోవడం కూడా సమస్యగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు సిబ్బంది అవసరం ఉందని పోలీసు శాఖ చెబుతుంటే.. మరోవైపు అందుబాటులో ఉన్న హోం గార్డులకు సరైన విధులు ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. డ్యూటీ ఎప్పుడు వస్తుందో తెలియక, ఎక్కడికి పంపిస్తారో తెలియక ఎదురుచూడాల్సిన పరిస్థితి తమకు ఉందని కొందరు హోం గార్డులు వాపోతున్నారు.

సిబ్బంది కొరతా.. లేక వినియోగంలో లోపమా?

పోలీసు శాఖలో సిబ్బంది కొరత తరచూ చర్చకు వస్తుంది. అదనపు బలగాల అవసరం ఉందని అధికారులు చెబుతుంటారు. అయితే అందుబాటులో ఉన్న హోం గార్డుల సేవలను ప్రజా భద్రతకు బదులుగా వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ప్రజల భద్రత కోసం కేటాయించిన హోం గార్డులను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.

సైబరాబాద్ పరిధిలో గత కొద్దిరోజులుగా 23 మంది హోం గార్డులకు విధులు కేటాయించక పోవడంతో వారు డ్యూటీల కోసం ఎదురుచూపులు చూస్తున్నట్లు చెబుతున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ లో తోటపనులు, ఇతర విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తాజాగా ఓమాజీ ఉన్నతాధికారి ఇంటి వద్ద తోటపనులకు వెళ్లాలని ఓ ఎస్సై ఆదేశించడంతో పాటు అక్కడికి వెళ్లాలని ఒత్తిడి చేయడంతో ఓ హోంగార్డు గుండెపోటుతో కిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందిన విషాద ఘటన పోలీసు వ్యవస్థలో హోం గార్డుల దుస్థితికి అద్దంపడుతోంది.

మాకు సరైన విధులు కేటాయించండి..

పోలీసు విధులు చేయడానికి వచ్చాం. కానీ ఎప్పుడు ఏ పని చేయాల్సి వస్తుందో తెలియదు. కొన్నిసార్లు అధికారుల ఇళ్ల వద్ద కూడా పనులు చేయాల్సి వస్తుంది. మా సమస్యను ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ హోం గార్డు తన ఆవేదన వ్యక్తం చేశారు. హోం గార్డుల ఆరోపణల్లో మరో కోణం కూడా ఉంది. ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేస్తే తమపై ప్రతికూల ప్రభావం పడుతుందనే భయంతో చాలామంది నేరుగా మాట్లాడేందుకు వెనుకాడుతున్నారు.  ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించి హోంగార్డుల విధుల కేటాయింపు, వారి సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉంది.

డీజీపీ సీవీ ఆనంద్ పై గంపెడు ఆశలు..

తాను పనిచేసిన ప్రతీచోట సంస్కరణలు చేపడుతూ వచ్చిన ప్రస్తుత రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పై హోం గార్డులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఖాకీ యూనిఫామ్స్ కష్టాలు తెలిసిన వ్యక్తి, తమ బాధలు తీర్చాలని, తమను పోలీసులకు సహాయకులుగా నిర్దిష్టమైన విధులు కేటాయించాలని వేడుకుంటున్నారు. హోం గార్డు వ్యవస్థలో మార్పులు చేసి, ట్రాఫిక్, ఇతర విభాగాల్లో తమకు విధులు కేటాయించాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.