Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelangana22A Land Issues : 22-ఏ భూములు.. అసలు కథేమిటి..? భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేకా..?

22A Land Issues : 22-ఏ భూములు.. అసలు కథేమిటి..? భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేకా..?

📰 Generate e-Paper Clip

  • యాజమాన్య హక్కులకు ముప్పా?
  • ప్రభుత్వ భూముల రక్షణ నుంచి సామాన్యుడి ఆస్తి హక్కుల వరకు..
  • 22-ఏ నిషేధిత భూముల జాబితాపై కొత్త చర్చ
  • తెలంగాణలో లక్షలాది ఆస్తులపై పెరుగుతున్న ఆందోళన
  • 22-ఏ చుట్టూ ఎందుకింత వివాదం?
  • ప్రతిపక్షాలు ఏమంటున్నాయి..
  • ప్రభుత్వం ఏం చెబుతుంది..

 

తెలంగాణ బ్యూరో( ప్రభంజనం ) :మీ భూమి 22-ఏ నిషేధిత భూముల జాబితాలో ఉందని రికార్డుల్లో కనిపిస్తే ఏం జరుగుతుంది? రిజిస్ట్రేషన్ ఆగిపోతుందా? మీ భూమి ప్రభుత్వానిదైపోతుందా? లేక అది కేవలం రిజిస్ట్రేషన్‌పై నిషేధమా? తెలంగాణలో ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. అంతటా చర్చనీయాంశమయ్యాయి?.. అందరి సందేహాలు ఈ 22-ఏ నిషేధిత భూముల గూర్చే.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది. అసలు ఈ 22-ఏ నిషేధిత భూములు ఏమిటి, ఎందుకు ఇంత వివాదాస్పదంగా మారాయి. అనేది ఇప్పుడు అందరిలో ఉత్పన్నమవుతున్న ప్రశ్న.

తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22-ఏ కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఆస్తులపై అమ్మకం, బదలాయింపు, గిఫ్ట్‌, లీజు తదితర లావాదేవీల రిజిస్ట్రేషన్‌కు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు, అటవీ భూములు, వక్ఫ్‌, దేవాదాయ, స్థానిక సంస్థలు తదితర ప్రభుత్వ లేదా సంస్థాగత ప్రయోజనాలు ఉన్న భూములను రక్షించడమే 22-ఏ నిబంధన ప్రధాన ఉద్దేశం.

కానీ ఒక భూమి పొరపాటున లేదా వివాదాస్పద రికార్డు ఆధారంగా 22-ఏ నిషేధిత జాబితాలో చేరితే? అప్పటికే ఇల్లు కట్టుకున్న వారు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు, రుణాలు తీసుకున్న వారు, సంవత్సరాలుగా పన్నులు చెల్లిస్తున్న వారు ఏం చేయాలి? ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం భూ రికార్డులను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియలో భాగంగా నిషేధిత ఆస్తుల జాబితాను పరిశీలిస్తోంది. అధికారిక భూ భారతి పోర్టల్‌లో నిషేధిత ఆస్తుల వివరాలను చూడటంతో పాటు, 22-ఏ జాబితాలో తమ భూమి చేరినట్లు భావించే వారికి ఫిర్యాదు చేసే సదుపాయం కూడా ఉంది.

అసలు 22-ఏ అంటే ఏమిటి?

సాధారణంగా చెప్పాలంటే 22-ఏ అనేది భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే చట్టం కాదు.
రిజిస్ట్రేషన్‌ చట్టం, 1908లోని సెక్షన్‌ 22-ఏ ప్రకారం కొన్ని రకాల ఆస్తులకు సంబంధించిన పత్రాలను రిజిస్టర్‌ చేయకుండా ప్రభుత్వం నిషేధించవచ్చు.

చట్టపరంగా ముఖ్యమైన వర్గాల్లో పరిశీలిస్తే..

* చట్టం ప్రకారం బదలాయింపు నిషేధితమైన భూములు
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూములు
* ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఆస్తులు
* భూ సంస్కరణల చట్టాల కింద మిగులు భూములుగా గుర్తించిన భూములు
* దేవాదాయ, ధార్మిక, స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన నిర్దిష్ట ఆస్తులు
* వక్ఫ్‌ ఆస్తులు
* కోర్టులు, రెవెన్యూ అధికారులు లేదా ఇతర చట్టపరమైన ప్రక్రియల కారణంగా ప్రభుత్వ ప్రయోజనాలు ఉన్నట్లు గుర్తించిన ఆస్తులు వంటివి నిషేధిత జాబితాలోకి రావచ్చు.

22-ఏ నిషేధిత జాబితాలో పేరు ఉండటం అంటే తప్పనిసరిగా ఆ భూమి ప్రభుత్వానిదే అని తుది తీర్పు వచ్చినట్టుకాదు. భూమి హక్కు, టైటిల్‌, స్వాధీనం, రికార్డులు వంటి అంశాలపై వివాదం ఉంటే అది ప్రత్యేకంగా పరిశీలించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం భూములను 22-ఏ లో ఎప్పుడు పెడుతుంది?

ఒక భూమిపై ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ సంస్థకు చట్టబద్ధమైన ప్రయోజనం ఉందని రికార్డుల ద్వారా గుర్తించినప్పుడు, దాని బదలాయింపును నిరోధించడానికి 22-ఏను ఉపయోగించవచ్చు.
ఈ భూమి ప్రభుత్వ భూమి అని రెవెన్యూ రికార్డుల్లో ఉంటే, దాన్ని ప్రైవేటు వ్యక్తులు అమ్మకుండా నిరోధించడం అవసరం.

అలాగే ఈ భూమి అసైన్డ్‌ భూమి,
ఇది వక్ఫ్‌ ఆస్తి,
ఇది దేవాదాయ సంస్థకు చెందినది,
ఇది అటవీ భూమి,
ఈ భూమిపై కోర్టు వివాదం ఉంది.
అనే పరిస్థితుల్లో కూడా సంబంధిత చట్టాలు, నోటిఫికేషన్ల ఆధారంగా రిజిస్ట్రేషన్‌పై ఆంక్షలు రావచ్చు.

తెలంగాణ హైకోర్టు తాజా కేసుల్లో కూడా 22-ఏ జాబితాలో చేర్చడంపై భూ యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి. కొన్ని కేసుల్లో పాత రెవెన్యూ రికార్డులు, పహాణీలు, పట్టాదారు పాస్‌బుక్కులు, గత రిజిస్ట్రేషన్లు వంటి అంశాలను కోర్టు పరిశీలించింది.

22-ఏలో ఏ రకమైన భూములు వస్తాయి?

22-ఏను ఒకే రకమైన భూములకు వర్తించే జాబితాగా చూడటం తప్పు.

ప్రధానంగా ఈ కేటగిరీలు కనిపిస్తాయి…

ప్రభుత్వ భూములు

ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా విక్రయించకుండా నిరోధించేందుకు.

అసైన్డ్‌ భూములు..

పేదలకు ప్రభుత్వం కొన్ని షరతులతో కేటాయించిన భూములు. వీటి బదలాయింపుపై ప్రత్యేక చట్టపరమైన పరిమితులు ఉంటాయి.

అటవీ భూములు..

అటవీ చట్టాల పరిధిలో రక్షణ అవసరమైన భూములు

వక్ఫ్‌ ఆస్తులు..
వక్ఫ్‌ సంస్థలకు చెందిన ఆస్తులు

దేవాదాయ, ధార్మిక సంస్థల ఆస్తులు..

దేవాలయాలు, ధార్మిక లేదా స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన ఆస్తులు.

భూ సంస్కరణలు / సీలింగ్‌ పరిధిలోని భూములు..

చట్టం ప్రకారం మిగులు లేదా ప్రభుత్వ ప్రయోజనానికి సంబంధించిన భూములు.

కోర్టు, రెవెన్యూ లేదా ఇతర చట్టపరమైన వివాదాల్లో ఉన్న భూములు..

సంబంధిత చట్టపరమైన ప్రక్రియల కారణంగా రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు.

గత బీఆర్ ఎస్ హయాంలో ఎన్ని ఎకరాలు 22-ఏలో పెట్టారు?

ఇది ప్రస్తుతం రాజకీయంగా తీవ్రంగా చర్చకు వస్తున్న అంశం.
అయితే బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో 22-ఏ జాబితాలో చేర్చిన మొత్తం భూముల అధికారిక, జిల్లా వారీ, సంవత్సరాల వారీ సమగ్ర గణాంకం రెవెన్యూ అధికారులు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ అధికారికంగా వెల్లడించలేదు. గతంలో అప్పటి ప్రభుత్వాల భూ రికార్డులు, ధరణి, రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్‌ రికార్డుల్లో 22-ఏకు సంబంధించిన వివిధ జాబితాలు ఉన్నప్పటికీ, బీఆర్ ఎస్ హయాంలో మొత్తం ఇన్ని ఎకరాల అని చెప్పే ఒకే అధికారిక లెక్కను బయటపెట్టలేదు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇదే కారణంగా ప్రస్తుతం బీఆర్ ఎస్ నాయకులు ప్రభుత్వం నుంచి శ్వేతపత్రం విడుదల చేసి, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22-ఏలో చేర్చిన భూముల పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు 22-ఏలో పెట్టింది?

ఇదే ప్రశ్న ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా మారింది. 2026 ఫిబ్రవరిలో వచ్చిన నివేదికల ప్రకారం, జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన వివరాల ఆధారంగా ప్రభుత్వం సుమారు 93 లక్షల ఎకరాలను నిషేధిత కేటగిరీలోకి తీసుకురావడానికి జిల్లా వారీ జాబితాలను సిద్ధం చేసిందని సమాచారం. అయితే అది ప్రతిపాదిత/పునర్వ్యవస్థీకరించిన జాబితాగాఅధికారులు పేర్కొన్నారు. పాత రికార్డులు అసంపూర్ణంగా ఉండటం వల్ల అసలు నిషేధిత భూముల విస్తీర్ణంపై స్పష్టత లేకుండా పోయింది.

మరోవైపు 2026 జూలైలో వచ్చిన జాబితా ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలు తమ భూముల వివరాలను సమర్పించగా, దాదాపు ఒక కోటి ఎకరాల వరకు భూములు నిషేధిత కేటగిరీలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వక్ఫ్‌ బోర్డు తన సవరించిన జాబితాను ఇప్పటి వరకు సమర్పించలేదు.

అసలు సమస్య ఎక్కడుంది?

22-ఏ ఉద్దేశం ప్రభుత్వ ఆస్తులను కాపాడటం. కానీ ఒక ప్రైవేటు భూమి పొరపాటున 22-ఏలో చేరితే, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

*భూయజమాని తన భూమిని విక్రయించలేడు
* రిజిస్ట్రేషన్‌ నిలిచిపోతుంది
* బ్యాంకు రుణం పొందడం కష్టమవుతుంది
* కుటుంబ ఆస్తిని విభజించడం లేదా బదలాయించడం సమస్యగా మారుతుంది
* కొనుగోలుదారులు వెనక్కి తగ్గవచ్చు

సాధారణ ప్రజలకు ఇబ్బందులు..

ఇల్లు లేదా ప్లాట్ కొనుగోలు చేసిన తర్వాత రికార్డులో 22-ఏ సమస్య బయటపడితే ఆస్తి విలువ, రిజిస్ట్రేషన్‌, భవిష్యత్‌ లావాదేవీలు ప్రభావితమవుతాయి.

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి భూమి టైటిల్‌పై అనిశ్చితి పెరిగితే ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు. పెట్టుబడిదారులు, డెవలపర్లు, బ్యాంకులు కూడా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.

పెద్ద ల్యాండ్‌ బ్యాంకులకు, వందల ఎకరాలు ఉన్న సంస్థలు లేదా డెవలపర్ల భూముల్లో కొంత భాగం 22-ఏలో చేరినా మొత్తం ప్రాజెక్టుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

మా భూమి 22-ఏలో ఎందుకు?.. సామాన్యుడి ప్రశ్న

ఈ వివాదంలో ఇది ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన ప్రశ్న.
ఒక కుటుంబం దశాబ్దాలుగా భూమిని అనుభవిస్తూ ఉండవచ్చు. పన్నులు చెల్లించి ఉండవచ్చు. పాత రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు ఉండవచ్చు. పట్టాదారు పాస్‌బుక్‌ ఉండవచ్చు.
అయినా ఒక దశలో ఆ సర్వే నంబర్‌ 22-ఏ జాబితాలో కనిపిస్తే లావాదేవీ ఆగిపోవచ్చు.
ఇలాంటి సందర్భాల్లో పాత రికార్డులు, టైటిల్‌ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులు, సర్వే వివరాలు, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు అన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. అయితే తెలంగాణ భూ భారతి వ్యవస్థలో 22-ఏ జాబితాలో చేర్చడంపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక ప్రక్రియను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

కోర్టుల ముందుకు వెళ్తున్న 22-ఏ వివాదాలు

22-ఏపై వివాదాలు కేవలం రాజకీయ స్థాయిలోనే లేవు. తెలంగాణ హైకోర్టులో కూడా అనేకమంది భూ యజమానులు తమ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ కేసులు దాఖలు చేస్తున్నారు.
2026 మేలో ఒక కేసులో హైకోర్టు పాత రెవెన్యూ రికార్డులు, పహాణీలు, ప్రభుత్వ వాదన, ప్రైవేటు వ్యక్తుల పత్రాలు తదితర అంశాలను పరిశీలించింది. సంబంధిత భూమి ఇప్పటికే ఇళ్లుగా, రోడ్లుగా అభివృద్ధి చెందిన పరిస్థితిని కూడా కోర్టు గమనించింది. చివరికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని ఆశ్రయించాలని సంబంధిత పిటిషనర్లకు మార్గనిర్దేశం చేసింది.

మరో కేసులో 2026లో రిటైర్డ్‌ న్యాయమూర్తి కుటుంబానికి చెందిన భూములను 22-ఏలో చేర్చడంపై హైకోర్టు మధ్యంతర ఉపశమనం ఇచ్చింది.

ఇవన్నీ కూడా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
22-ఏ జాబితాలో పేరు ఉండటం మాత్రమే తుది యాజమాన్య తీర్పు కాదు. ప్రతి కేసులో రికార్డులు, చట్టపరమైన హక్కులు, భూమి స్వభావం వంటి అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.

విపక్షాల ఆరోపణలు ఏమిటి?

బీఆర్ ఎస్ నాయకులు ప్రస్తుతం 22-ఏ జాబితాపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22-ఏలో చేర్చిన భూములపై వైట్‌పేపర్‌ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 22-ఏను ప్రభుత్వం వేధింపులకు, అవినీతికి సాధనంగా ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. మొత్తం కాలనీలు, పెద్ద సంఖ్యలో ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల లక్షలాది ఆస్తి యజమానులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

 

ప్రభుత్వం ఏమంటోంది?

రాష్ట్రంలో కొనసాగుతున్న 22-ఏ నిషేధిత భూముల వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండ‌కుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. రిజిస్ట్రేష‌న్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో ప‌రిశీలించి, అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేష‌న్ వెంట‌నే చేస్తారని తెలిపారు. జిల్లా క‌లెక్టర్లు 22-ఏ జాబితా భూములను క్షుణ్ణంగా ప‌రిశీలించి, శాశ్వ‌త ప‌రిష్కారానికి స‌రైన జాబితాను రూపొందిస్తారని, అందులో ఎలాంటి త‌ప్పులు లేకుండా చూడాల‌ని, ఈ ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించారు. ప్రజ‌లు త‌మ భూ హ‌క్కుల విష‌యంలో ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేదన్న సీఎం ప్రజ‌ల ఆస్తి హ‌క్కుల ప‌రిర‌క్షణ‌కు రాష్ట్ర ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉందని, ప్రైవేటు భూముల‌కు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వమన్నారు.

పేదవాడి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా ఈ ప్రభుత్వం తీసుకోద‌ని, వారి హక్కులు, ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ, సంస్థాగత భూములను రక్షించడం, రికార్డులను సరిచేస్తామని, 22-ఏ కారణంగా ప్రజలకు కలిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేసి, భూ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం ఒకవైపు సర్కార్ భూములను కాపాడే ప్రయత్నం చేస్తూనే, తప్పుగా నిషేధిత జాబితాలో చేరినట్లు భావిస్తున్న ప్రైవేటు భూముల ఫిర్యాదులను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఎదుర్కొంటోంది.

అధికారులకు ఎదురవుతున్న సవాలు

తెలంగాణలో దశాబ్దాలుగా ఏఏ రకాల భూ రికార్డులు నిర్వహించబడ్డాయి అనే వాటిని పూర్తిగా పరిశీలించాల్సి రావడం..

* పాత పహాణీలు
* సేత్వార్‌ రికార్డులు
* పట్టాదారు పాస్‌బుక్కులు
* రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు
* అసైన్డ్‌ భూముల రికార్డులు
* కోర్టు తీర్పులు
* ప్రభుత్వ ఉత్తర్వులు
* వక్ఫ్‌, దేవాదాయ, అటవీ రికార్డులు

ఇవన్నీ ఒకదానితో మరొకటి సరిపోల్చడం పెద్ద పరిపాలనా సవాలుగా మారుతుంది.

2026లో హైకోర్టు ముందు వచ్చిన కేసులు కూడా పాత రికార్డులు, ప్రస్తుత రికార్డులు, ప్రభుత్వ హక్కుల మధ్య తేడాలు వివాదాలకు దారితీస్తున్నాయని చూపుతున్నాయి.

22-ఏపై ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి?

ప్రజలలో అనుమానాలు తొలగించాలంటే ప్రభుత్వం కొన్ని విషయాల్లో పూర్తి పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉంది.

జిల్లా వారీగా పూర్తి జాబితా

ప్రతి జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్‌ వారీగా 22-ఏ భూముల వివరాలు అందుబాటులో ఉంచాలి.

కారణం స్పష్టంగా ఉండాలి

ఒక భూమి ఎందుకు 22-ఏలో ఉందో స్పష్టంగా చూపాలి.
ప్రభుత్వ భూమా? అసైన్డ్‌ భూమా? వక్ఫ్‌ భూమా? అటవీ భూమా? కోర్టు వివాదమా?
అన్నది ప్రజలకు తెలియాలి.

తప్పుగా చేరిన భూములకు వేగవంతమైన పరిష్కారం

ఏళ్ల తరబడి కేసులు నడవకుండా, నిర్ణీత గడువులో ఫిర్యాదులను పరిష్కరించాలి.

రాజకీయ ఆరోపణలకు బదులుగా గణాంకాలు

బీఆర్ ఎస్ హయాంలో ఎంత భూమి చేర్చారు?
కాంగ్రెస్‌ హయాంలో ఎంత చేర్చారు?
ఎంత భూమిని తొలగించారు?ఎంత భూమి ప్రభుత్వానిదిగా నిర్ధారించారు?

ఇలాంటి ప్రశ్నలకు శ్వేతపత్రంతో సమాధానం ఇస్తే వివాదాలకు తెరపడుతుంది.

22-ఏపై ముఖ్యమైన వాస్తవాలు

వాస్తవం–1: 22-ఏఅనేది రిజిస్ట్రేషన్‌ను నిషేధించే చట్టపరమైన వ్యవస్థ.

వాస్తవం–2: 22-ఏలో ఉండే భూములు ఒకే రకానికి చెందినవి కావు.

వాస్తవం–3: ప్రభుత్వ భూములతో పాటు చట్టపరమైన పరిమితులు ఉన్న కొన్ని సంస్థాగత, అసైన్డ్‌, వక్ఫ్‌, దేవాదాయ, అటవీ తదితర ఆస్తులు కూడా సంబంధిత నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలో ఉండవచ్చు.

వాస్తవం–4: 22-ఏలో పేరు ఉండటం మాత్రమే యాజమాన్యంపై తుది తీర్పు కాదు.

వాస్తవం–5: తప్పుగా చేర్చినట్లు భావించే వ్యక్తులకు భూ భారతి ద్వారా ఫిర్యాదు చేసే వ్యవస్థ ఉంది.

వాస్తవం–6: 2026లో 22-ఏ జాబితా విస్తరణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు నివేదికలు వెలువడ్డాయి.

వాస్తవం–7: 93 లక్షల ఎకరాల ప్రతిపాదిత జాబితా, దాదాపు కోటి ఎకరాల వరకు ఇప్పటికే నిషేధిత కేటగిరీలో ఉన్నట్లు వచ్చిన ఆరోపణలకంటే.. దీనిపై ప్రభుత్వమే సరైన వివరాలు బయపెట్టాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ అసలు సమస్య 22-ఏ కాదు.. రికార్డుల స్పష్టత.
22-ఏ నిబంధన ఉద్దేశం ప్రభుత్వ, ప్రజా ప్రయోజన ఆస్తులను అక్రమ బదలాయింపుల నుంచి కాపాడటమే.
భూమి రికార్డులు స్పష్టంగా లేకపోతే 22-ఏ రక్షణ వ్యవస్థే సామాన్యుడికి సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఒకవైపు ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలి.

మరోవైపు నిజమైన పట్టాదారుడి భూమి తప్పుగా నిషేధిత జాబితాలో చేరకుండా చూడాలి.
ఈ రెండింటి మధ్య సమతుల్యతే అసలు పరీక్ష. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.

22-ఏను కేవలం రాజకీయ అస్త్రంగా చూడటం ఎంత తప్పో, ప్రతి 22-ఏ భూమిని వివాదాస్పదం కాదని భావించడం కూడా అంతే తప్పు.
ప్రభుత్వ భూమి అయితే ప్రభుత్వం కాపాడాలి.బ్ప్రైవేటు భూమి అయితే యజమాని హక్కులను ప్రభుత్వం కాపాడాలి.
వివాదాస్పద భూమి అయితే చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవాలి.

అందుకే తెలంగాణ ప్రజలు కోరేది ఒక్కటే..

ఎవరి భూమి? ఎందుకు 22-ఏ నిషేధిత జాబితాలో ఉంది? ఏ రికార్డు ఆధారంగా చేర్చారు? ఎప్పుడు చేర్చారు? ఎవరు నిర్ణయించారు? తప్పు అయితే ఎప్పుడు తొలగిస్తారు?.
ఈ ప్రశ్నలకు జిల్లాల వారీగా, సర్వే నంబర్ల వారీగా, కాలక్రమం ప్రకారం ప్రభుత్వం సమాధానం ఇస్తే 22-ఏ చుట్టూ ఉన్న అనేక అనుమానాలకు తెరపడుతుంది.
అంతిమంగా.. 22-ఏ లక్ష్యం ప్రభుత్వ ఆస్తుల రక్షణ కావాలి కానీ, రికార్డుల గందరగోళం వల్ల నిజమైన భూయజమాని హక్కులు దెబ్బతినకూడదు.
అదే పారదర్శక భూ పరిపాలనకు అసలైన పరీక్ష.

గత బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన లక్షలాది ఎకరాల భూములను నిషేధిత జాబితాలు పెట్టారు. అర్హులైన పట్టదారుల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించడం, ప్రభుత్వ భూములను రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. రెవెన్యూ శాఖ మంత్రి కూడా 22-ఏ నిషేధిత జాబితా గూర్చి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజ‌ల ఆస్తి హ‌క్కుల ప‌రిర‌క్షణ‌కు ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు 22-ఏ నిషేధిత భూముల అంశాన్ని కావాలనే రాజకీయం చేస్తుంది. ప్రజలు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు.

22-ఏ నిషేధిత జాబితా గూర్చి భయం వద్దు: నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

గత బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన లక్షలాది ఎకరాల భూములను నిషేధిత జాబితాలు పెట్టారు. అర్హులైన పట్టదారుల భూములను నిషేధిత జాబితా నుండి తొలగించడం, ప్రభుత్వ భూములను రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. రెవెన్యూ శాఖ మంత్రి కూడా 22-ఏ నిషేధిత జాబితా గూర్చి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజ‌ల ఆస్తి హ‌క్కుల ప‌రిర‌క్షణ‌కు ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు 22-ఏ నిషేధిత భూముల అంశాన్ని కావాలనే రాజకీయం చేస్తుంది. ప్రజలు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ప్రజలను ఇబ్బందులు పెడుతుంది: మాధవరం కృష్ణారావు కూకట్ పల్లి ఎమ్మెల్యే.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో చెలగాటం ఆడుతుంది. ఇప్పటికే నిర్మాణాలు అయిన స్థలాలను, ప్రైవేట్ ఆస్తులను 22-ఏ నిషేధిత జాబితాలో పెడుతుంది దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వాటిని క్లియర్ చేస్తామంటూ మళ్లీ ప్రభుత్వంలోని కొందరు దందా చేస్తున్నారు. బాధితులకు బీఆర్ ఎస్ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు ప్రజల తరపున పోరాడుతాం.

22-A నిషేధిత జాబితా సమస్యపై రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలి: ఆకుల సతీష్ సామాజిక కార్యకర్త..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ కారణంగా అనేక మంది నిజమైన భూయజమానులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం వాస్తవం. భూ రికార్డుల్లో జరిగిన అవకతవకల వల్ల అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని ప్రజలు అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని, భూముల వివరాలను పారదర్శకంగా నిర్వహిస్తామని, యాజమాన్య హక్కులను పరిరక్షిస్తామని చెప్పి ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం వర్క్‌షాప్‌లు, సదస్సులు, కమిటీలు నిర్వహించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదు.
ముఖ్యంగా గతంలో 22-A నిషేధిత జాబితాలో లేని అనేక సర్వే నంబర్లు, భూములు, అపార్ట్‌మెంట్లు సైతం ఇటీవలి కాలంలో నిషేధిత జాబితాలో చేర్చబడటంతో ప్రజలు తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తులు కొనుగోలు చేసిన వారు, విక్రయించాల్సిన వారు, రుణాలు పొందాల్సిన వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
తప్పు జరిగిందని అంగీకరించి, దాన్ని సరిదిద్దుతామని రెవెన్యూ అండ్ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించడం మాత్రమే సరిపోదు. ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో వేగంగా పరిష్కారం కావాలి. టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయడం, ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామని చెప్పడం కాకుండా, నిషేధిత జాబితాలోకి అన్యాయంగా చేరిన ఆస్తులను తక్షణమే పరిశీలించి తొలగించాలి.
అధికారుల చుట్టూ తిరుగుతూ ప్రజలు మరింత ఇబ్బందులు పడే పరిస్థితిని ప్రభుత్వం నివారించాలి. గతంలో 22-ఏ నిషేధిత జాబితాలో లేని భూములు, ఆస్తులు ఏ ప్రాతిపదికన జాబితాలో చేర్చబడ్డాయో ప్రభుత్వం బహిర్గతం చేయాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.