నాచారం: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. సూర్యనగర్ ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంతో ఉప్పల్ మరియు నాచారం ఎస్‌ఓటీ (SOT) పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 7 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో తుర్కపల్లి గ్రామానికి చెందిన నేమా బుక్యా గణేష్ అనే వ్యక్తిని పోలీసులు సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యంతో పాటు నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం నాచారం పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న నిందితుడిపై నాచారం పోలీసులు కేసు నమోదు చేసి, దీని వెనుక ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.


