Saturday, August 29, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaధరణి నుండి భూభారతి వరకు "స్లాట్ క్యాన్సిల్" మోసం

ధరణి నుండి భూభారతి వరకు “స్లాట్ క్యాన్సిల్” మోసం

📰 Generate e-Paper Clip

 

కోట్ల రూపాయల రీఫండ్ పెండింగ్…

బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటారు కానీ డబ్బు మాత్రం రాదు

మెదక్ జిల్లా ప్రతినిధి, ( ప్రభంజనం ):ధరణి పోర్టల్ నుండి ఇప్పటి భూ భూభారతి వరకు రిజిస్ట్రేషన్ కోసం వెళ్లే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఏ కారణంతోనైనా క్యాన్సిల్ చేసుకుంటే కట్టిన డబ్బు తిరిగి రావడం లేదు. దీంతో అటు డబ్బులు రాక, ఇటు రిజిస్ట్రేషన్ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు మాకేం తెలియదు అంటూ సమాధానాలు చెబుతుండడంతో ప్రజలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.

స్లాట్ క్యాన్సిల్ చేస్తే డబ్బు గల్లంతు

భూముల రిజిస్ట్రేషన్ కోసమని ఆన్‌లైన్‌లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలు చెల్లించి స్లాట్ బుక్ చేసుకుంటారు. అనివార్య కారణాల వల్ల స్లాట్ క్యాన్సిల్ చేసుకుంటే, పోర్టల్ బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ ఎస్ సీ( IFSC) కోడ్ వివరాలు అడుగుతుంది. కానీ వివరాలు ఇచ్చి నెలలు గడిచినా ఒక్క రూపాయి కూడా తిరిగి ఖాతాలో పడడం లేదు.

కోట్ల రూపాయలు ప్రభుత్వం వద్దే

ధరణి ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి భూభారతి వరకు వేలాది మంది దరఖాస్తుదారుల రీఫండ్ డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కొక్కరికి రూ.15 వేల నుండి లక్షల రూపాయల వరకు ఇరుక్కుపోయాయి. మొత్తంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా కోట్ల రూపాయలు ప్రజల నుండి వసూలు చేసి ప్రభుత్వం వద్దే ఆగిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ప్రజల ఆగ్రహం

అర్జెంట్ గా తేదీ మార్చుకోవడానికి స్లాట్ క్యాన్సిల్ చేస్తే రూ.45 వేలు పోయింది. 8 నెలలు అయింది. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు” అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం.. కానీ డబ్బు మాత్రం రాలేదు. ఇది నేరుగా ప్రజల జేబులకు చిల్లు పెట్టడమే” అని మరొకరు మండిపడ్డారు.

సాంకేతిక లోపమా? నిర్లక్ష్యమా?

పోర్టల్ లో రీఫండ్ ఆప్షన్ ఉన్నా అది కేవలం పేరుకేనని, వెనుక ఎలాంటి ప్రాసెస్ లేకుండా ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా సర్వర్ సమస్య ఉంది అని చెప్పి చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు.

వెంటనే రీఫండ్ చేయాలి

ప్రజలు కష్టపడి కట్టిన డబ్బు కాబట్టి దాన్ని వెంటనే తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. భూభారతి పోర్టల్ లో ఆటోమేటిక్ రీఫండ్ సిస్టం తీసుకురావాలని, పెండింగ్ లో ఉన్న అన్ని రీఫండ్ లను 15 రోజుల్లో విడుదల చేయాలని కోరుతున్నారు. జిల్లా కలెక్టర్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.