- బాస్కెట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై కేసు నమోదు
- పోక్సోతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
- ఆర్ సీ పురంలో జీరో ఎఫ్ఐఆర్ చేసి మాదాపూర్ పోలీసులకు బదిలీ…

సైబరాబాద్,( ప్రభంజనం ) :బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిపై పలుమార్లు లైంగిక, కుల వివక్ష వ్యాఖ్యలు చేసి వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై బాస్కెట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు, నిందితుడు పృథ్వీశ్వర్ రెడ్డి వివిధ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లలో బాలికను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలతో పాటు కులం పేరుతో దూశించాడని బాలిక తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.2024 ఫిబ్రవరిలో జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండూరులో జరిగిన టోర్నమెంట్‌లో బాలిక పట్ల అసభ్య సంజ్ఞలు చేసినట్లు,అనంతరం 2025 డిసెంబర్‌లో మాదాపూర్‌లో జరిగిన మరో టోర్నమెంట్‌లో బాలిక శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో ఫిర్యాదులో స్పష్టం చేశారు. 2026 జూన్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన టోర్నమెంట్‌లో బాలిక పాల్గొనడాన్ని ప్రశ్నిస్తూ అవమానించాడని, వివిధ పోటీల్లో పదేపదే కులం పేరుతో దూషిస్తూ మానసికంగా వేధించాడని బాధితురాలి తల్లి ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా రామచంద్రాపురం పోలీసులు క్రైమ్ నెం.1105/2026గా కేసు నమోదు చేసి, మాదాపూర్ పోలీసులకు బదిలీ చేశారు.నిందితుడిపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 75(1)(iv), 75(1)(v), ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టంలోని సెక్షన్లు 11, 12, పోక్సో చట్టం-2012లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


