- సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసలు
తెలంగాణ బ్యూరో (ప్రభంజనం): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) విచార్ విభాగ్ (ఇంటెలెక్చువల్ సెల్) సమావేశం గురువారం గాంధీ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విచార్ విభాగ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ విచార్ విభాగ్ చైర్మన్ కెప్టెన్ ప్రవీణ్ దావర్, ఏఐసీసీ విచార్ విభాగ్ వైస్ చైర్పర్సన్ పుష్ప లక్ష్మణ స్వామి, టీపీసీసీ విచార్ విభాగ్ చైర్మన్ ఎ. శ్యామ్ మోహన్, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలు, అభ్యుదయ భావాలను బలోపేతం చేయడంలో విచార్ విభాగ్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ పార్టీపై నిరంతరం అసత్య ప్రచారం చేస్తూ, రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కులం, మతం, వర్గం, ప్రాంతానికి అతీతంగా ప్రతి పౌరుడి సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పేదలు, బలహీన వర్గాలు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు, కార్మికులు సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ నిలుస్తుందని పేర్కొన్నారు. లౌకికవాదం, సామాజిక సామరస్యం, రాజ్యాంగ పరిపాలన పట్ల కాంగ్రెస్ పార్టీ అంకితభావంతో ఉందని, మత ప్రాతిపదికన విభజన రాజకీయాలను వ్యతిరేకిస్తుందని, సమానత్వం, న్యాయం, జాతీయ ఐక్యత, సమగ్ర అభివృద్ధే పార్టీ లక్ష్యాలని ఆయన పునరుద్ఘాటించారు. టీపీసీసీ విచార్ విభాగ్ చైర్మన్ ఎ. శ్యామ్ మోహన్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. ఏఐసీసీ విచార్ విభాగ్ చైర్మన్ కెప్టెన్ ప్రవీణ్ దావర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అపూర్వమైన అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
ప్రధానమంత్రి పలు జాతీయ అంశాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ-కాశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడ్డాయని కేంద్రం చెబుతున్నప్పటికీ, ఉగ్రవాద ఘటనలు పెరిగాయని పేర్కొన్నారు. అయోధ్య రామమందిరంకు సంబంధించిన ఆర్థిక అవకతవకలను తీవ్రంగా ఖండిస్తూ, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే చర్యలను ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు.


