Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaమెదక్కొత్తపల్లి బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డుపై బీఆర్‌ఎస్‌ హెచ్చరిక.. వారం రోజులే గడువు

కొత్తపల్లి బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డుపై బీఆర్‌ఎస్‌ హెచ్చరిక.. వారం రోజులే గడువు

📰 Generate e-Paper Clip

  • వారం రోజుల్లో పనులు చేపట్టకపోతే భారీ ధర్నా: పద్మా దేవేందర్‌ రెడ్డి

మెదక్ ప్రతినిధి, (ప్రభంజనం) : మెదక్‌ నుంచి బొడ్మెట్‌పల్లి వెళ్లే ప్రధాన మార్గంలోని కొత్తపల్లి వద్ద బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన బ్రిడ్జికి అప్రోచ్‌ రోడ్డు నోచుకోకపోవడంపై మాజీ డిప్యూటీ స్పీకర్‌ ఎం. పద్మా దేవేందర్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె పాపన్నపేట మండల నాయకులతో కలిసి కొత్తపల్లి వద్ద బ్రిడ్జిని పరిశీలించారు. ఈ సందర్భంగా రాకపోకలు సాగిస్తున్న వాహనదారులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌ హయాంలో, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.1.40 కోట్లతో కొత్తపల్లి వద్ద బ్రిడ్జిని నిర్మించామని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటికీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అప్రోచ్‌ రోడ్డు లేకపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బ్రిడ్జి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించకపోవడం బాధాకరమన్నారు.ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టదా? అని ప్రశ్నించిన ఆమె.. జిల్లా కలెక్టర్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలను విమర్శించడం మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

భారీ ధర్నా తప్పదు
వారం రోజుల్లోగా కొత్తపల్లి బ్రిడ్జిపై అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని పద్మా దేవేందర్‌ రెడ్డి హెచ్చరించారు. ప్రజల సమస్య పరిష్కారమయ్యే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆమె వెంట మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకటరామిరెడ్డి, కొడపాక సర్పంచ్‌ పంకజ కాశీనాథ్‌రావు, మాజీ సర్పంచ్‌లు శ్రీనాథ్‌రావు, బద్రి మల్లేశం, అలాగే నాయకులు సోములు, దుర్గయ్య, అనిల్‌రెడ్డి, బాబాగౌడ్‌, అంతోని, శ్రీనివాస్‌గౌడ్‌, మేడిశెట్టి రాము, దండం సామేల్‌, మల్లేశం, చంద్రన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.