Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeజాతీయoఏపీకి 21, తెలంగాణకు 15 మెడల్స్.. తెలుగు రాష్ట్రాలకు పోలీసు పతకాల పండుగ

ఏపీకి 21, తెలంగాణకు 15 మెడల్స్.. తెలుగు రాష్ట్రాలకు పోలీసు పతకాల పండుగ

📰 Generate e-Paper Clip

  • 1057 మందికి కేంద్రం గ్యాలంట్రీ, సేవా పతకాల ప్రకటన
  • స్వాతంత్ర్య దినోత్సవ వేళ పోలీసులకు అరుదైన గౌరవం

ఢిల్లీ, ప్రభంజనం: స్వాత్రంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్‌, పౌర రక్షక వంటి విభాగాల్లో సేవలందిస్తోన్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ/సేవా పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1057 మందిని ఈ పతకాలకు హోంశాఖ ఎంపిక చేసింది. వీరిలో 92 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు ఇవ్వనుంది. 301 మందికి పోలీసు మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ, 664 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు (మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌) అందించనుంది. గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్న 301 మందిలో అత్యధికంగా 197 మంది తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులున్నారు. జమ్మూకశ్మీర్‌లో పనిచేస్తోన్న 51 మంది, ఈశాన్య రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తోన్న 12 మంది పోలీసులకు ఈ పతకాలు దక్కాయి. ప్రాణాలను, ఆస్తులను కాపాడటం, నేరాలను నిరోధించడంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి కేంద్ర హోంశాఖ ఏటా ఈ అవార్డులను అందజేస్తోంది.

ఏపీకి 21, తెలంగాణకు15
తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పోలీసులకు ఈ పతకాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 21 మంది వీటికి ఎంపికయ్యారు. ఇందులో ఏడుగురు పోలీసులకు గ్యాలంట్రీ మెడల్స్‌, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 11 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు లభించనున్నాయి. ఏపీకి చెందిన ఐజీ గుడి విజయ్‌ కుమార్‌, ఐజీ బలంకారి వెంకట రామిరెడ్డి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. హెడ్‌ కానిస్టేబుళ్లు కొర్లాన మహేశ్‌, పైడి శ్రీరామమూర్తి, అడారి హేమసుందర రావు, చింతపల్లి సత్యనారాయణ, రౌతు మహేశ్‌, ఆబోతుల అప్పలనాయుడు, రుతాల కన్నబాబుకు గ్యాలంట్రీ మెడల్స్‌ దక్కాయి. తెలంగాణ నుంచి 15 మంది జాబితాలో ఉన్నారు. వీరిలో ముగ్గురు పోలీసులకు గ్యాలంట్రీ మెడల్స్‌, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 10 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు ప్రకటించారు. తెలంగాణ అదనపు డిప్యూటీ కమిషనర్‌ జోగుల నర్సయ్య, ఎస్పీ ఆర్‌. జగదీశ్వర్‌ రెడ్డి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు అందుకోనున్నారు. జూనియర్‌ కమాండోలు బి. సత్యరావు, కె. సందీప్‌ కుమార్‌, జె.వంశీకృష్ణ గ్యాలంట్రీ మెడల్స్‌కు ఎంపికయ్యారు. ఇక, కేంద్ర దర్యాప్తు సంస్థలో పనిచేస్తోన్న 21 మంది అధికారులకు కూడా ఈ పతకాలు దక్కాయి. వీరిలో ఆరుగురు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 15 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు ప్రకటించారు. వీరిలో విశాఖపట్నం డీఎస్పీ (సీబీఐ)గా ఉన్న సంజయ్‌ కుమార్‌ సమాల్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం దక్కింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.