కూకట్ పల్లి,( ప్రభంజనం): మహాగణపతి నవరాత్రి ఉత్సవాల వేళ విఘ్నేశ్వరుడి సాక్షిగా రాజకీయ నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, అవకతవకల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలంటూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రఘునందన్ నేత ఏకంగా మహాగణపతికే వినతిపత్రం సమర్పించారు. గణనాథుడి ముందు అర్జీ పెట్టుకున్న ఈ వినూత్న నిరసన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భూలోకానికి విచ్చేసిన విఘ్నేశ్వరుడు ప్రజల కష్టాలను తొలగించి రాష్ట్రాన్ని కాపాడాలని రఘునందన్ నేత వేడుకున్నారు. తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జీవించే పరిస్థితులు కల్పించాలని కోరుతూ గణనాథుడికి వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఈ సందర్భంగా ప్రస్తుత పాలనపై రఘునందన్ నేత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, దౌర్జన్యాలు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను కష్టాల నుంచి కాపాడి, అన్యాయాలను రూపుమాపేలా ఆదిదేవుడే అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయ విమర్శలను నేరుగా దేవుడి వేదికగా వినిపిస్తూ బీఆర్ఎస్ నేత చేపట్టిన ఈ కార్యక్రమం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.


