Sunday, November 8, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeక్యూవీఎస్ఈ యాప్‌తో ఆన్‌లైన్ పెట్టుబడి మోసాలు..

క్యూవీఎస్ఈ యాప్‌తో ఆన్‌లైన్ పెట్టుబడి మోసాలు..

📰 Generate e-Paper Clip

  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
  • వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

వరంగల్ బ్యూరో, ( ప్రభంజనం )

ప్రజలు ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచించారు. క్యూవీఎస్ఈ
( క్వాంటమ్ వెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ )
యాప్ ద్వారా పెద్ద ఎత్తున ఆన్‌లైన్ పెట్టుబడి మోసాలు జరుగుతున్నట్లు కేంద్ర, రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగాలు హెచ్చరించాయని తెలిపారు. ఈ మోసంలో భాగంగా సైబర్ నేరగాళ్లు బాధితులను క్యూవీఎస్ఈ యాప్ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలని ప్రేరేపిస్తున్నారు. అనంతరం భారతీయ రూపాయలను ఎక్స్ఛేంజ్ ద్వారా క్రిప్టోకరెన్సీగా మార్చి పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. కనీసం 500 యూఎస్ డాలర్లు (సుమారు రూ.54,000) పెట్టుబడి పెడితే భారీగా లాభం వస్తుందని ఆశ చూపుతున్నారు. అంతేకాకుండా, ఇతరులను యాప్‌లో చేర్పిస్తే మొదటి స్థాయి రిఫరల్‌కు 50 యూఎస్డీటీ, రెండో స్థాయి రిఫరల్‌కు 25 యూఏఎస్డీటీ ఇస్తామని నమ్మిస్తున్నారు. ఈ తరహా మోసాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 56 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అధిక లాభాలు, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పే ఆన్‌లైన్ పెట్టుబడి పథకాలను నమ్మవద్దని హెచ్చరించారు. తెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైళ్లను, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దన్నారు. ధృవీకరించని యాప్‌లు, ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో డబ్బు పెట్టుబడి పెట్టవద్దని, క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బు బదిలీ చేయాలని కోరితే అప్రమత్తంగా ఉండండని సూచించారు. మీ ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. ఇతరులను రిఫర్ చేస్తే అదనపు ఆదాయం వస్తుందని చెప్పే పథకాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
అత్యాశకు పోయి కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోవద్దని, అప్రమత్తతే సైబర్ మోసాల నుంచి రక్షణ అన్నారు వరంగల్ సీపీ శ్వేత. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. త్వరగా ఫిర్యాదు చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.