- వివరాలు వెల్లడించిన నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
నిజామాబాద్, (ప్రభంజనం):
నిజామాబాద్ లో సంచలనం సృష్టించిన డబల్ మర్డర్ కేసులో నిందితులకు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ఇందుకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన లత, ఆమె రెండేళ్ల కుమారుడు హర్షవర్ధన్‌ను హత్య చేసిన కేసులో నిందితులు దాసరి రాజశేఖర్, అతని భార్య నాగలక్ష్మీకి నిజామాబాద్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2022 ఆగస్టు 2న ఆస్తి వివాదం నేపథ్యంలో తల్లీకొడుకులను నైలాన్ తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు విచారణలో తేలింది. మృతదేహాలను నిర్మానుష్య ప్రాంతంలో పడవేసి సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఇద్దరికీ ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష కూడా విధించింది. హత్య కేసులో ఇద్దరు నిందితులకు కలిపి రూ.40 వేల జరిమానా, సాక్ష్యాల ధ్వంసం కేసులో మరో రూ.40 వేల జరిమానా విధించారు. మరో ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.


