- తెలంగాణ పోరుబాటలో జింకల మల్లేష్ ప్రస్థానం..
- పదవులు లేకున్నా పార్టీకి అంకితభావం
ఉప్పల్, ( ప్రభంజనం ):
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నాటి నుంచి నేటి వరకు అలుపెరగని పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ఉద్యమకారుడు జింకల మల్లేష్. మాణికేశ్వరి నగర్, ఉస్మానియా యూనివర్సిటీ బస్తీకి చెందిన ఆయన రాజకీయ ప్రస్థానం తెలంగాణ ఉద్యమ చరిత్రతో ముడిపడి ఉంది. పదవుల కోసం కాకుండా పార్టీ సిద్ధాంతాలు, ఉద్యమ ఆశయాల కోసం పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు.
2008లో గులాబీ గూటికి..
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో 2008లో అప్పటి తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతో తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు ఉద్యమ నాయకులతో కలిసి రాష్ట్ర సాధన పోరాటంలో భాగస్వాములయ్యారు.
ప్రతి మలుపులోనూ ఉద్యమ బాటలోనే..
తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలైన విద్యుత్ సౌధ ఉద్యమం, రైల్ రోకోలు, సాగరహారం, శ్రీకృష్ణ కమిటీ నివేదికకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, దీక్షా దివస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేసీఆర్, కేటీఆర్ వెంట నందినగర్ నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించిన ఉద్యమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో జరిగిన ఆందోళనల కారణంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఎదుర్కొన్నప్పటికీ ఉద్యమ లక్ష్యం నుంచి వెనక్కి తగ్గలేదు.
గ్రేటర్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్‌లో క్రియాశీలకంగా కొనసాగుతూ గ్రేటర్ హైదరాబాద్ మాజీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల సమన్వయం, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారు. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అధిష్ఠానం ఇచ్చిన ప్రతి పిలుపునకు స్పందిస్తూ ధర్నాలు, నిరసనలు, ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలే ముఖ్యం..
దాదాపు రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయడం జింకల మల్లేష్ ప్రత్యేకత. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ గులాబీ జెండా సైనికుడిగా కొనసాగుతున్నారు.
తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారుల సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. నాటి ఉద్యమ జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ, నేటికీ ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న జింకల మల్లేష్ ప్రస్థానం ఉద్యమకారులకు, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.


