- 150 మంది పోలీసు సిబ్బందితో విస్తృత తనిఖీలు
- 179 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, కారు స్వాధీనం
- ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి
- ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి
ఆదిలాబాద్ ప్రతినిధి, (ప్రభంజనం ): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, నేరాల నియంత్రణ, ప్రజలతో పోలీసుల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుపల్లి, ఖిల్లా ఏరియాలలోఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలు మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని తెల్లవారుజామున నుండి నిర్వహించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 5 గంటల నుంచే సుమారు 150 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 179 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 1 కార్, స్వాధీనం చేసుకున్నారు.
ఫేక్ నెంబర్ ప్లేట్లు అమర్చిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని, (బీఎన్ ఎస్ ) సెక్షన్ 318(4) ప్రకారం చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఆసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ రాయితీ (పీడీఎస్) బియ్యాన్ని కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం లేదా అక్రమంగా తరలించడం నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గంజాయి నిర్మూలనకు జిల్లా పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, గంజాయి సేవించడం, నిల్వ ఉంచడం, రవాణా చేయడం, సరఫరా చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సీసీటీవీ కెమెరాల ప్రాధాన్యత తెలియజేస్తూ కాలనీ మొత్తం కలిసికట్టుగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకట నర్సయ్య, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్ర వర్ధన్, సీఐలు సునీల్ కుమార్, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు వెంకటి, మురళి, చంద్రశేఖర్, ఎస్సైలు, రిజర్వ్ సిబ్బంది, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


