Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaమెదక్సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

  • ఈ నెల 15న సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
  • సభాస్థలి, హెలిపాడ్ ను పరిశీలించిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, జగ్గారెడ్డి

సంగారెడ్డి: ( ప్రభంజనం ):ఈ నెల 15వ తేదీన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి లో అధికారికంగా ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను, అంబేద్కర్ స్టేడియంలోని బహిరంగ సభ స్థలిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి పరిశీలించారు. అధికారులకు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు అరకొరగా మాత్రమే రేషన్ కార్డులు అందాయని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా కోటి 5 లక్షల మందికి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందించబోతున్నామని తెలిపారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంగారెడ్డి గడ్డపై ఘన స్వాగతం పలుకుతామని జగ్గారెడ్డి తెలిపారు. సుమారు 50 వేల మంది జనసమీకరణతో ఈ బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.