- జాతీయ జెండా ఆవిష్కరించిన సీపీ డాక్టర్ రమేష్
శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం సాధించి 80 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. అనేక దేశాలు స్వాతంత్ర్యం పొందినప్పటికీ రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్య విలువలు, చట్టాల అమలులో ఎదురైన సమస్యల కారణంగా స్థిరత్వాన్ని సాధించలేకపోయాయని, భారత్ మాత్రం బలమైన ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థతో ఎనిమిది దశాబ్దాలుగా స్థిరంగా ముందుకు సాగుతోందని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆర్థిక, భౌగోళిక, వాణిజ్య, సాంకేతిక మార్పులతో పాటు అంతర్జాతీయ సవాళ్లను భారత్ సమర్థంగా ఎదుర్కొంటూ స్వయం సమృద్ధి దిశగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ శాస్త్ర, సాంకేతిక, ఫార్మా రంగాల్లో ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందుతోందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలపడం లక్ష్యమన్నారు. ఇందుకోసం ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు, సాంకేతిక రంగం, ఉపాధి అవకాశాలు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.ప్రజలకు, పరిశ్రమలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం ద్వారా అభివృద్ధికి పోలీస్ శాఖ తన వంతు సహకారం అందిస్తుందని సీపీ తెలిపారు. హైదరాబాద్‌లో పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ఇతర పెట్టుబడులు పెరగాలంటే శాంతిభద్రతలు కీలకమని, ఈ విషయంలో పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. ప్రజా కేంద్రిత పోలీసింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రజలకు, పరిశ్రమలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు. శాంతిభద్రతలను సమర్థంగా నిర్వహించడం ద్వారా హైదరాబాద్ అభివృద్ధికి, మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు పోలీసులు తమ వంతు సహకారం అందిస్తున్నారని వివరించారు.

17 మంది పోలీసులకు సేవా పతకాలు
విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించిన నలుగురు పోలీసు సిబ్బందికి ఉత్తమ సేవా పతకాలు, మరో 15 మంది సిబ్బందికి సేవా పతకాలను సీపీ డా. ఎం. రమేష్ అందజేశారు. పతకాలు అందుకున్న సిబ్బందిని అభినందించిన ఆయన ఇదే అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.అనంతరం పోలీస్ సిబ్బంది కుటుంబాలకు చెందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. చిన్నారులతో సీపీ ముచ్చటించి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ఫొటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్, అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి, శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్. శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ వైవీఎస్. సుధీంద్ర, ఎస్ఓటీ డీసీపీ శోభన్ కుమార్, సైబరాబాద్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


