Thursday, August 27, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeక్రీడలుఫీల్డింగ్‌లో కైఫ్ పెట్టిన రూల్ అదే.. యువరాజ్ నుంచి ఎంతో నేర్చుకున్నా: రైనా

ఫీల్డింగ్‌లో కైఫ్ పెట్టిన రూల్ అదే.. యువరాజ్ నుంచి ఎంతో నేర్చుకున్నా: రైనా

📰 Generate e-Paper Clip

  • తమ కాలంలో ప్రత్యేక ఫీల్డింగ్ కల్చర్ ఉండేదని చెప్పిన సురేశ్ రైనా
  • డైరెక్ట్ త్రో కొడితేనే తుది జట్టులో చోటని కైఫ్ చెప్పేవాడని వెల్లడి
  • కైఫ్, యువరాజ్ సింగ్‌ల నుంచి ఎంతో నేర్చుకున్నానని వ్యాఖ్య
  • సిడ్నీలో ఇర్ఫాన్ పఠాన్‌తో జరిగిన ప్రమాదాన్ని గుర్తుచేసుకున్న వైనం
  • క్యాచ్ పట్టేటప్పుడు కమ్యూనికేషన్ ముఖ్యమని ఆ ఘటన నేర్పిందన్న రైనా
భారత క్రికెట్ జట్టులో తన తరం ఆటగాళ్లు అత్యుత్తమ ఫీల్డింగ్ యూనిట్‌గా ఎలా మారారో మాజీ ఆల్‌రౌండర్ సురేశ్ రైనా గుర్తుచేశాడు. కఠోరమైన ప్రాక్టీస్, క్రమశిక్షణ, సీనియర్ ఆటగాళ్ల నుంచి నేర్చుకున్న పాఠాలే తమను ప్రపంచంలోనే మేటి ఫీల్డర్లుగా తీర్చిదిద్దాయని అన్నాడు. ఆనాటి ఫీల్డింగ్ కల్చర్, తన కెరీర్‌ను మలుపు తిప్పిన కొన్ని సంఘటనలను రైనా గుర్తుచేసుకున్నాడు.

ఓ ఇంటర్వ్యూలో రైనా మాట్లాడుతూ.. “మేం ఒక ప్రత్యేకమైన ఫీల్డింగ్ కల్చర్‌ను సృష్టించుకున్నాం. ప్రాక్టీస్ సెషన్‌లో మొదట ఉండేది ఫీల్డింగే. అందుకే ఆటగాళ్లందరూ అరగంట ముందే మైదానంలోకి వచ్చేవారు. ఇప్పటిలా కొన్ని క్యాచ్‌లు పట్టి అయిపోయిందని అనుకునేవాళ్లం కాదు. హై క్యాచ్‌లు, గ్రౌండ్ ఫీల్డింగ్, స్లిప్ క్యాచ్‌లు, ప్యారలల్ క్యాచ్‌లు.. ఇలా ప్రతీదీ విడివిడిగా ప్రాక్టీస్ చేసేవాళ్లం. అప్పట్లో మహ్మద్ కైఫ్ మా యూపీ జట్టుకు కెప్టెన్‌గా ఉండేవాడు. ‘సింగిల్ వికెట్‌ను డైరెక్ట్‌గా త్రో కొడితేనే తుది జట్టులో చోటు ఉంటుంది’ అని చెప్పేవాడు” అని తెలిపాడు.

ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్‌ను ఆరాధించేవాడినని, ఉత్తరప్రదేశ్ జట్టులో కైఫ్, భారత జట్టులో యువరాజ్ సింగ్‌ల నుంచి ఎంతో నేర్చుకున్నానని రైనా అన్నాడు. “కైఫ్, యువీ పాయింట్, కవర్‌లో ఫీల్డింగ్ చేస్తుంటే నేను మిడ్-ఆఫ్‌లో ఉండేవాడిని. మేం ముగ్గురం కలిసి బంతిని దాటనిచ్చేవాళ్లం కాదు” అని చెప్పాడు.

ఇదే క్రమంలో సిడ్నీలో ఇర్ఫాన్ పఠాన్‌తో జరిగిన ప్రమాదాన్ని రైనా గుర్తుచేసుకున్నాడు. “ఆస్ట్రేలియా పర్యటనలో జడేజా బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ స్వీప్ షాట్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. మిడ్-వికెట్‌లో ఉన్న నేను పరుగెత్తాను. ఫైన్ లెగ్ నుంచి ఇర్ఫాన్ కూడా వస్తున్నాడనే విషయం నాకు తెలియదు. నా దృష్టి అంతా బంతిపైనే ఉంది. క్యాచ్ పూర్తి చేయగానే ఇర్ఫాన్‌ను బలంగా ఢీకొట్టాను. అదృష్టవశాత్తూ నా భుజం మాత్రమే తగిలింది. కానీ, ఆ ప్రమాదంలో ఇర్ఫాన్ పక్కటెముక విరిగింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సంఘటన మాకు ఓ ముఖ్యమైన పాఠం నేర్పింది. ఎవరి క్యాచ్ అయితే వాళ్లు పిలవాలనే విషయం అప్పుడే అర్థమైంది” అని రైనా చెప్పుకొచ్చాడు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.