Thursday, August 27, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaవరంగల్పెరోల్‌పై బయటకొచ్చి.. 40 ఏళ్లుగా పరారీలో.. వెలుగులోకి వచ్చిన సంచలన కథ

పెరోల్‌పై బయటకొచ్చి.. 40 ఏళ్లుగా పరారీలో.. వెలుగులోకి వచ్చిన సంచలన కథ

📰 Generate e-Paper Clip

  • పెరోల్‌పై విడుదలై 40 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ జీవిత ఖైదీ
  • ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు
  • ఉత్తమ ఉపాధ్యాయుడిగా సన్మానం
  • రిటైర్డ్ అయ్యాక పోలీసులకు చిక్కిన వైనం
  • 40 ఏళ్ల 58 రోజుల పాటు పోలీసుల చిక్కని వీరన్న
  • మినహాయింపును తిరస్కరించిన కోర్ట్
  • రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన జీవితఖైదీ స్టోరీ

వరంగల్ బ్యూరో, (ప్రభంజనం): జీవిత ఖైదు అనుభవిస్తున్న సమయంలో పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి జైలుకు వెళ్లకుండా ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు తప్పించుకుని జీవించిన ఓ ఖైదీని పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఆశ్చర్యకరంగా అతడు ఈ కాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేయడమే కాకుండా 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును కూడా అందుకున్నాడు. అనంతరం ఉద్యోగ విరమణ చేసి సాధారణ జీవితం గడుపుతున్న అతడిని 40 తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వేరెక్కడో కాదు తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సందెల వీరన్న ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో వరంగల్ జిల్లా కోర్టు 1983 జూన్ 9న అతడికి జీవిత ఖైదు విధించింది. అనంతరం అదే ఏడాది డిసెంబరు 17న వీరన్నకు పెరోల్ మంజూరైంది. పెరోల్ గడువు ముగిసిన తర్వాత 1984 మార్చి 18న తిరిగి జైలులో లొంగిపోవాల్సి ఉంది. అయితే వీరన్న నిర్ణీత తేదీన జైలుకు తిరిగి వెళ్లలేదు. అప్పటి నుంచి అతడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని జీవించాడు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొత్త జీవితం

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరన్న తన గుర్తింపును దాచుకుని సుమారు మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసినట్లు అధికారులు గుర్తించారు. ఉద్యోగ జీవితంలో భాగంగా పాఠశాలలో విధులు నిర్వహిస్తూ సాధారణ వ్యక్తిలా జీవించాడు. అతడి సేవలకు గుర్తుగా 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కూడా అందుకున్నాడు. అనంతరం ఉద్యోగ విరమణ చేశాడు. అంటే, జైలు నుంచి పెరోల్‌పై బయటకు వచ్చిన తర్వాత తనపై ఉన్న జీవిత ఖైదు విషయం అధికారుల దృష్టికి రాకుండానే చాలా కాలం ప్రభుత్వ ఉద్యోగం చేశాడు.

40 ఏళ్ల 58 రోజుల తర్వాత అరెస్టు..

వీరన్న జైలు నుంచి బయటకు వచ్చాక దాదాపు 40 ఏళ్ల 58 రోజుల తర్వాత, అంటే 2024 మే 16న, వరంగల్ సెంట్రల్ జైలు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన అతడి పరారీ జీవితానికి తెరపడింది. జీవిత ఖైదు పడిన వ్యక్తి పెరోల్‌పై విడుదలై తిరిగి జైలుకు రాకుండా ఇంత సుదీర్ఘకాలం బయట ఉండటం, ఆ కాలంలో ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఈ ఘటనను ప్రత్యేకంగా నిలిచింది. వీరన్నను అదుపులోకి తీసుకున్న అనంతరం జైలు అధికారులు అతడికి మూడేళ్ల పాటు ఎలాంటి పెరోల్ లేదా జైలు శిక్ష మినహాయింపు ఇవ్వకుండా మెమో జారీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ అతడి భార్య సందెల చారమ్మ, బంధువుల సహాయంతో హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీరన్న ఉద్దేశపూర్వకంగానే జైలుకు తిరిగి వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో మినహాయింపులు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో నాలుగు దశాబ్దాల క్రితం పెరోల్‌పై బయటకు వచ్చి తిరిగి జైలుకు వెళ్లని వీరన్న వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది.

జీవిత ఖైదు పడిన వ్యక్తి పెరోల్‌పై బయటకు వచ్చి, నాలుగు దశాబ్దాల పాటు తన అసలు శిక్షను అనుభవించకుండా సాధారణ పౌరుడిలా జీవించడం, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేయడంతో పాటు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకోవడం ఈ ఘటనలో అత్యంత చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.