Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaకబ్జాదారుల నుంచి కాపాడాను: తనను తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందన

కబ్జాదారుల నుంచి కాపాడాను: తనను తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందన

📰 Generate e-Paper Clip

  • హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశం
  • ఆయనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉండటంతో ఈ నిర్ణయం
  • లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు కాపాడానని వివరణ ఇచ్చిన రంగనాథ్
  • భూమాఫియానే తనపై తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపణ
హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి తనను తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలపై ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ స్పందించారు. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను కాపాడటమే లక్ష్యంగా తాను పనిచేశానని ఆయన తెలిపారు. గత రెండేళ్లలో హైడ్రా ద్వారా సుమారు రూ. 1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కబ్జాదారుల చెర నుంచి విడిపించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూమాఫియా, పలుకుబడి కలిగిన కబ్జాదారులే న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇప్పటివరకు ఆరు చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని, మరో 20 చెరువుల పున‌రుద్ధ‌రణ ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయని ఆయన తెలిపారు. బడా బాబులు ఆక్రమణలో ఉన్న వందలాది చెరువులు, పార్కులు, వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను గత రెండేళ్లలో హైడ్రా స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించిందని పేర్కొన్నారు. ల్యాండ్ మాఫియా, భూకబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

లోతుకుంట భూముల విషయంలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ సుమారు రూ. 10,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని, రూ. 2,500 కోట్ల విలువైన వారసత్వ శిలలను (హెరిటేజ్ రాక్ ఫార్మేషన్స్‌) ధ్వంసం చేసిందని రంగనాథ్ వివరించారు. పర్యావరణవేత్తలు, స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకే తాము చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. తనపై ఉన్న 63 కేసులు కూడా ఇటువంటి కబ్జాదారులు పెట్టినవేనని, వాటిని న్యాయపరంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు.

సేవ్ ది రాక్ సొసైటి, పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే హైడ్రా రంగంలోకి దిగిందని రంగనాథ్ స్పష్టం చేశారు. ఎక్కడో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమిని చూపిస్తూ, 120 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన సదరు బిల్డర్, తనపై కోర్టు ధిక్కరణ కేసు వేశారని ఆయన వెల్లడించారు.

బతుక‌మ్మ‌ కుంట చెరువును కబ్జా చేయాలని చూసిన వారు, లోతుకుంటలో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆశించిన వారు, సామాన్యుల ప్లాట్లను ఆక్రమించి భారీ కాంప్లెక్స్‌లు నిర్మించాలని చూస్తున్న సంధ్యా శ్రీధర్ రావు, వేలాది మంది సింగరేణి కార్మికుల ప్లాట్స్‌లను కాజేయాలని చూసిన నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతూ పరభుత్వ భూములను, సామాన్యుల ప్లాట్లను ఆక్రమించిన ముఖీం, వీరందరికీ హైడ్రా కమిషనర్‌గా తాను అడ్డుపడటమే చేసిన తప్పని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరూ కలిసి తనపై 63 కోర్టు ధిక్కారణ కేసులు వేశారని, వీటిని ఎదుర్కోవడానికి తానేమీ వెనుకంజ వేయడంలేదని స్పష్టం చేశారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, చట్టం పట్ల గౌరవంతోనే విధులు నిర్వహిస్తున్నానని రంగనాథ్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.