ప్రభంజనం: రాష్ట్రంలో తక్కువ వర్షాపాతం నమోదైన నేపథ్యంలో వరుణ యాగం చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సంమృద్ధిగా పండాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు సంపూర్ణంగా నిండాలని, ఎల్‌నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై లేకుండా ఉండాలని, ఆకాంక్షతో వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
ముఖ్యమంత్రి సూచనల మేరకుయాదగిరిగట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (వైటిడి) అర్చక, సిద్ధాంతులు ఆగస్టు 10 వ తేదీన వరుణ యాగానికి మూహూర్తం నిర్ణయించారు. యాదగిరిగుట్ట దేవస్థాన ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు, వేదపండితులు, అర్చక బృందం సమక్షంలో మహా వరుణయాగం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర మహాయాగం కృష్ణానది తీరాన వెలసిన నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున, విజయవిహార్ ఆవరణలో జరగనుంది. ఈ మహాయాగంలో భాగంగా సాయంత్రం 3.24 గంటలకు జరిగే పూర్ణాహుతి మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.


