Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaమేడ్చల్ నియోజకవర్గంలో రియల్ మోసం.. కాళేశ్వరం కాలువలో మునిగిన 'ఎస్సార్ వెంచర్'..!

మేడ్చల్ నియోజకవర్గంలో రియల్ మోసం.. కాళేశ్వరం కాలువలో మునిగిన ‘ఎస్సార్ వెంచర్’..!

📰 Generate e-Paper Clip

  • అనుమతులు లేవు.. అక్రమ విక్రయాలే లక్ష్యం
  • 70 మంది అమాయక బాధితుల ఆవేదన
  • ప్రభుత్వ పరిహారాన్నీ నొక్కేసిన రియల్ వ్యాపారి
  • మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

మేడ్చల్: రూపాయి రూపాయి కూడబెట్టి.. సొంతింటి కలను నిజం చేసుకుందామనుకున్న మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెలగాటమాడాడు. ఎలాంటి అనుమతులు లేని అక్రమ వెంచర్‌ను అంటగట్టి, సుమారు 70 మంది కుటుంబాలను రోడ్డున పడేశాడు. చివరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారాన్ని సైతం ఆ వ్యాపారే కాజేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్‌లోని చింతల్‌కు చెందిన కల్లూరి సుభాష్‌రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడ్చల్ మండలం రావల్‌కోల్ గ్రామానికి అనుబంధ గ్రామమైన గూడెం గడ్డ తండాలో ఎలాంటి అనుమతులు లేకుండా ‘ఎస్సార్ వెంచర్’ పేరుతో ఓ అనధికారిక లేఅవుట్‌ను ఏర్పాటు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంలో ఆరితేరిన సుభాష్‌రెడ్డి.. అమాయక ప్రజలను నమ్మించి ప్లాట్లను విక్రయించాడు.

అయితే, ఈ వెంచర్ ప్రాంతం కాళేశ్వరం కాలువ పరిధిలోకి వస్తుందనే విషయం తెలిసి కూడా బాధితులకు ఆ విషయాలను గోప్యంగా ఉంచాడు. 2019లోనే కాళేశ్వరం కాలువ నిమిత్తం ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ.. వ్యాపారి దురాశతో 2020లో హడావిడిగా అమాయకులకు ఆ ప్లాట్లను అంటగట్టాడు.

సగం ప్లాట్లు కాలువలోనే..

ఈ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన దాదాపు 70 మంది బాధితుల్లో సగానికి పైగా ప్లాట్లు పూర్తిగా కాళేశ్వరం కాలువ కింద కోల్పోవడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. తమకు న్యాయం చేయాలని బాధితులు నిలదీయడంతో.. అదే ప్రాంతంలో వేరేచోట ప్లాట్లు ఇస్తానంటూ సుభాష్‌రెడ్డి కాలయాప్నకు తెరలేపాడు. 2020 నుంచి నేటి వరకు గత ఆరు సంవత్సరాలుగా నేడు, రేపు అంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నాడు.

పరిహారానికీ ఎసరు..! నామరూపం లేకుండా పోయిన వెంచర్

కాలువలో కోల్పోయిన భూమికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారాన్ని సైతం మోసపూరితంగా ఆ రియల్ వ్యాపారి తనే కాజేసినట్లు బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, సుభాష్‌రెడ్డి గతంలోనూ మేడ్చల్ మండలంలోని లింగాపూర్, మైసిరెడ్డిపల్లి, రావల్‌కోల్ గ్రామాల్లోనూ ఇలాంటి అక్రమ వెంచర్లే చేసి అనేక మందిని మోసం చేసినట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ‘ఎస్సార్ వెంచర్’ నామరూపాలు లేకుండా పోయింది.

పోలీసుల రంగప్రవేశం..కేసు నమోదు..

వ్యాపారి మోసంతో ఓపిక నశించిన బాధితులు ఐక్యమై మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మోసపూరిత రియల్ వ్యాపారి కల్లూరి సుభాష్‌రెడ్డిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి అనధికారిక వెంచర్లను, మోసపూరిత వ్యాపారులను నమ్మి ప్రజలు ఎవరూ మోసపోవద్దని బాధితులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.