- అధిక లాభాల ఆశ చూపి కోట్ల రూపాయల మోసం
- పెట్టుబడులు పెడితే అధిక లాభాలు అంటూ కుచ్చుటోపీ
- సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో కేసు
క్రైమ్ బ్యూరో, (ప్రభంజనం): తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు అంటూ కేటుగాళ్లు చెబుతున్న మాయమాటలు నమ్మి నిండా మునుగుతున్నారు అమాయకులు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రజలు మారడం లేదు. అధిక లాభాలు అనగానే గుడ్డిగా పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు. తాజాగా సైబరాబాద్ పరిధిలో ఇలాంటి మోసమే వెలుగులోకి వచ్చింది. మైహోం భూజలో గతేడాది గణేశ్ లడ్డూను వేలంలో రికార్డు స్థాయిలో రూ.51 లక్షలకు దక్కించుకున్న కొండపల్లి గణేశ్ మీద సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో కేసు నమోదైంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఇతను లిక్కర్, రియలేస్టేట్ లాంటి వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. గత కొన్నేళ్లుగా గణేశ్ రాయదుర్గంలోని మైహోం భూజలో ఉంటున్నాడు. గతేడాది సెప్టెంబరులో గణేష్ ఉత్సవాల సందర్భంగా మై హోం భూజాలో లడ్డూ వేలం నిర్వహించగా గణేష్ రూ.51 లక్షలకు దక్కించుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. స్థానికంగా అందరిలో ధనవంతుడనే పేరు సంపాదించుకున్నాడు. వేలం అనంతరం అపార్ట్మెంట్ల సముదాయంలోని నివాసితులకు లడ్డూ పంచాడు. ఈ క్రమంలోనే బోయిన్ పల్లి కిరణ్ అనే వ్యక్తి ద్వారా అందులోనే ఉండే సిల్వియా, ఆమె భర్త శ్రీనివాసరెడ్డితో గణేష్ కు పరిచయం ఏర్పడింది. తాము ప్రారంభించే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని, బదులుగా నెలకు 6 శాతం చొప్పున లాభం ఇస్తామని గణేష్, కిరణ్ వారికి చెప్పారు. నమ్మిన సిల్వియా దంపతులు తొలుత రూ.31 లక్షలు పంపారు. కొద్దిరోజులకు సిల్వియా దంపతులు లాభం గురించి అడగ్గా వాయిదా వేస్తూ వచ్చారు. ఫోన్లకు స్పందించడం మానేశారు. వారు బాధితులు మై హోమ్ భూజాలో ఆరాతీయగా ఈ ఏడాది ఏప్రిల్లో గణేష్, కిరణ్ ఇద్దరూ మైహోం భూజలోని నివాసాలను ఖాళీ చేశారని తేలింది. వారు మరికొందర్ని ఇలాగే మోసగించినట్లు తేలింది. గణేష్, కిరణ్ లు ఐదుగురి నుంచి మొత్తం రూ.3.45 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. మరికొందర్ని ఇదే తరహాలో మోసగించినట్లు తెలుసుకుని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.


