
శేరిలింగంపల్లి (ప్రభంజనం): గచ్చిబౌలి పరిధిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనకు సంబంధించి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయడంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించిన అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

సీఎంసీ కమిషనర్ జి. శ్రీజన ఆమోదంతో ఆగస్టు 22న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సర్కిల్-50, మాదాపూర్‌కు చెందిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ పర్మిషన్ అధికారి (టీపీబీఓ) యు. సంతోష్ కుమార్‌ను సస్పెండ్ చేశారు.
గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో ఇంటి నంబర్ 1-60/113/135/1 వద్ద అనుమతులు లేకుండా గ్రౌండ్ ప్లస్ ఆరు అంతస్తులు, పెంట్‌హౌస్‌తో భవన నిర్మాణం చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ భవనం ఆగస్టు 22న కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, సమీపంలోని మరో భవనానికి కూడా నష్టం వాటిల్లింది. అక్రమ నిర్మాణం జరుగుతున్న విషయం ఉన్నప్పటికీ దానిని నిలిపివేయడంలో టీపీబీఓ విఫలమైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగా ప్రాణనష్టం సంభవించి, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడిందని సీఎంసీ పేర్కొంది.
ఈ ఘటనపై యు. సంతోష్ కుమార్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని నిర్ణయించిన అధికారులు, విచారణ పూర్తయ్యే వరకు ఆయనను సస్పెన్షన్‌లో కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సివిల్ సర్వీసెస్ (సీసీ అండ్ ఏ) రూల్స్, 1991లోని రూల్ 8(1) కింద ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. సస్పెన్షన్ కాలంలో సంబంధిత అధికారి కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయ పరిధిని విడిచి వెళ్లకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


