Friday, August 28, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeభవనం కూలిన ఘటనలో బిల్డర్ అరెస్ట్..

భవనం కూలిన ఘటనలో బిల్డర్ అరెస్ట్..

📰 Generate e-Paper Clip

  • దేశం విడిచి పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు

శేరిలింగంపల్లి:

అనుమతులు లేకుండా నిర్మించిన భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనలో ప్రధాన నిందితుడైన బిల్డర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సయ్యద్ సజీద్ అలియాస్ సయ్యద్ సాజిద్ (39)ను ఈ నెల 23న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న కాంట్రాక్టర్ ఖాజా మొయినుద్దీన్ అలియాస్ మహ్మద్ ఖాజా మియా కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అంజయ్య నగర్‌ సర్వే నం. 135లో ప్లాట్ నం. 113/131/1, నిర్మాణంలో ఉన్న జీ+6 భవనం ఇటీవల ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాద సమయంలో అదే బిల్డింగ్ లో టైల్స్ పనులు చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేష్ కారే (45), మొహ్‌పాల్ భలావి (46) శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. మరోవైపు భవనం కూలిన ప్రభావంతో సమీపంలోని కొండాపూర్ వైట్‌ఫీల్డ్స్‌లోని జయదర్శిని రెసిడెన్సీ సీ-బ్లాక్‌కు నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో కే.వీ. రమణారెడ్డి (75)తో పాటు మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై జయదర్శిని రెసిడెన్సీకి చెందిన తక్కల వెంకట్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు క్రైమ్ నంబర్ 945/2026 కింద బీఎన్‌ఎస్‌లోని 105 ఆర్/డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ టి. భూపతి దర్యాప్తు చేపట్టారు.

అనుమతులు లేకుండానే నిర్మాణం

పోలీసుల దర్యాప్తులో భవనాన్ని బిల్డర్ సయ్యద్ సజీద్, కాంట్రాక్టర్ ఖాజా మొయినుద్దీన్ ద్వారా నిర్మిస్తున్నట్లు గుర్తించారు. అవసరమైన మున్సిపల్ అనుమతులు పొందకుండానే నిర్మాణం చేపట్టినట్లు, నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్‌లు పాటించలేదని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా పక్కనే ఉన్న నాలాను ఆక్రమించడం, నాసిరకం నిర్మాణ సామగ్రిని ఉపయోగించడం వంటి ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. భవనం కూలిన ఘటన అనంతరం పోలీసుల దర్యాప్తు వేగవంతం చేయడంతో ప్రధాన నిందితుడు సయ్యద్ సజీద్ దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో శంషాబాద్ వద్ద అతడిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ఖాజా మొయినుద్దీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత

మృతులు ఉమేష్ కారే, మొహ్‌పాల్ భలావిలకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌లో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనకు సంబంధించి మరిన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని రాయదుర్గం పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.