- వింటేజ్ వైబ్స్‌తో తెగ వైరల్ అవుతున్న ట్రెండ్
- ఎక్కడ చూసినా అప్పట్లోనే ఉన్నామనేలా నెటిజన్లు, సెలబ్రిటీల సరికొత్త హడావుడి
- సెపియా టోన్, ఆరెంజ్-బ్రిక్ కలరింగ్‌తో కట్టిపడేస్తున్న ఏఐ వింటేజ్ ఫొటోలు
- రాజకీయ నాయకుల నుంచి ట్రెండింగ్ ఇన్ఫ్లుయెన్సర్ల వరకు అందరినీ చుట్టేసిన ‘1980s’ ఫీవర్
హైదరాబాద్, (ప్రభంజనం): ఇన్స్టాగ్రామ్ రీల్స్ తిప్పినా, ఎక్స్ (ట్విట్టర్) ఫీడ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ వాల్ చూసినా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక మ్యాజిక్ నంబర్ ట్రెండ్ అవుతోంది. అదే ‘1980’. సరిగ్గా నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్లినట్లుగా, అప్పటి కాలం నాటి జ్ఞాపకాలను కళ్లకు కట్టేలా క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పాత కాలపు వింటేజ్ లుక్, ఆరెంజ్-బ్రిక్ టోన్ కలరింగ్, ఆ కాలం నాటి టెక్స్చర్స్తో కనిపిస్తున్న ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. కేవలం సాధారణ నెటిజన్లే కాకుండా, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం తమ చిన్ననాటి జ్ఞాపకాలను లేదా ఆనాటి గెటప్‌లను ఈ ఏఐ ట్రెండ్ ద్వారా రీ-క్రియేట్ చేసి పోస్ట్ చేస్తుండటంతో ఈ ఫీవర్ పీక్స్‌కు చేరింది.

ఊహలకు ఏఐ రూపం..
ఈ వింటేజ్ ట్రెండ్‌లో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా భాగస్వామ్యం కావడంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. అప్పట్లో లీడర్లు ఎలా ఉండేవారు, నాటి స్టార్ హీరోల స్టైల్స్ ఎలా ఉండేవి అనే ఊహలకు ఏఐ రూపం పోస్తుండటంతో అభిమానులు తెగ లైక్‌లు, షేర్లు కొడుతున్నారు. బ్లాక్ అండ్ వైట్ నుంచి సెపియా టోన్ ఫోటోల వరకు, పాత కాలపు కార్లు, అప్పటి కాలం నాటి టీవీలు, దుస్తుల ఫ్యాషన్‌ను ఈ ఏఐ జనరేటెడ్ ఇమేజ్ టెక్నాలజీ అత్యంత సహజంగా కళ్లకు కడుతోంది. దీంతో తమ అభిమాన నాయకులు, హీరోలు ఎనిమిదో దశకం నాటి గెటప్‌లో ఎలా ఉన్నారో చూసేందుకు నెటిజన్లు ఎగబడుతున్నారు.

హ్యాష్‌ట్యాగ్ 1980s తో ఫుల్ ట్రెండ్..
ఇదొక ట్రెండ్ మాత్రమే కాదు, ఒక తరం మొత్తాన్ని నాస్టాల్జియాలోకి తీసుకెళ్లే సెంటిమెంట్లా మారిపోయింది. అప్పట్లో పెరిగిన సోషలైజేషన్, ఆ సింప్లిసిటీ, ఆ పాత జ్ఞాపకాలను నేటి టెక్నాలజీతో ముడిపెట్టి చూపిస్తుండటంతో యూత్ సైతం దీనికి కనెక్ట్ అయిపోతున్నారు. కేవలం ఒక క్లిక్‌తో నాలుగు దశాబ్దాల వెనక్కి ప్రయాణించేలా చేస్తున్న ఈ ఏఐ ఫీచర్లు, యాప్స్ ఇప్పుడు ట్రేండింగ్ చార్ట్స్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచాయి. హ్యాష్‌ట్యాగ్ #1980s తో ట్రెండ్ అవుతున్న ఈ పోస్టులు డిజిటల్ ప్రపంచంలో ఒక ఊపు ఊపుతున్నాయి.

1980s ఏఐ ఫోటోల మేనియా..
ప్రతి రోజూ కొత్త కొత్త ట్రెండ్లతో హోరెత్తే సోషల్ మీడియాలో, ఈ ‘1980s ఏఐ ఫోటోల’ మేనియా మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. కేవలం వినోదం కోసం మొదలైన ఈ ట్రెండ్, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్ గ్యాలరీని పాత జ్ఞాపకాలతో నింపేస్తోంది. డిజిటల్ యుగంలోనూ పాత కాలం నాటి మధుర జ్ఞాపకాలను, ఆ వింటేజ్ వైబ్స్‌ను మళ్లీ బతికిస్తున్న ఈ ఏఐ మ్యాజిక్ రాబోయే మరికొన్ని రోజులు సోషల్ మీడియాను ఏలేయడం ఖాయంగా కనిపిస్తోంది.


