Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeబతుకమ్మకు ఎంత కష్టమొచ్చే..!

బతుకమ్మకు ఎంత కష్టమొచ్చే..!

📰 Generate e-Paper Clip

  • బతుకమ్మను వదిలేందుకు చెరువుల్లో నీరు కరువు ..?
  • తెలంగాణ ఆడపడుచుల పండుగకు నీటి కష్టాలు..
  • చెరువుల్లో నీరు లేక, బతుకమ్మలు ఎక్కడ వదలాలో తెలియక అయోమయం
  • అడుగంటిన చెరువులు, నెర్రబారిన కుంటలు
  • బతుకమ్మ నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలంటున్న ఆడపడుచులు

కీసర : ( ప్రభంజనం )

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వచ్చిందంటే ప్రతీ ఇంటా కోలాహలం నెలకుంటుంది. అత్తగారింటి నుండి ఆడపడుచులు వచ్చి బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. చిన్నా పెద్దా అనే తేడాలేకుండా మహిళలు బతుకమ్మను పేర్చి ఆడిపాడుతారు. అయితే ఈసారి మాత్రం బతుకమ్మ వేడుకల్లో ఆ హుషారు, ఉత్సాహం కనిపించేలా లేదు. బతుకమ్మను వేసేందుకు కూడా చెరువుల్లో నీరు లేని దుస్థితి నెలకొంది. ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూలను పేర్చి, బతుకమ్మలను సిద్ధం చేసుకుని సంబరంగా జరుపుకునే ఈ పండుగలో మొదటి నుండి చివరి రోజు వరకు నిమజ్జనం కోసం సరైన నీటి వసతులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రతి ఏటా బతుకమ్మ పండుగ వచ్చిందంటే గ్రామాలు, పట్టణాల్లో సందడి నెలకొంటుంది. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, పాటలు పాడుతూ చప్పట్లతో.. సంప్రదాయ నృత్యాలతో మహిళలు సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకుంటారు. అయితే బతుకమ్మలను నిమజ్జనం చేయాల్సిన చెరువుల్లో నీరు లేకపోవడంతో ఈసారి పండుగ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల గుంతలు తవ్వి, వాటిలో నీటిని నింపి నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం..

బతుకమ్మ పండుగకు ముందస్తు ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల మహిళల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. బతుకమ్మ పండుగ తేదీలు ముందుగానే తెలిసినా, నిమజ్జనానికి అవసరమైన నీటి సౌకర్యాలు కల్పించడంపై సంబంధిత అధికారులు తగిన దృష్టి సారించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువులను శుభ్రం చేయడం, నిమజ్జన ప్రాంతాలను సిద్ధం చేయడం, అవసరమైన నీటిని అందుబాటులో ఉంచడం వంటి చర్యలు ముందుగానే చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కొన్ని చోట్ల గ్రామస్థులు స్వయంగా బతుకమ్మను వేయడానికి వారే గుంతలు తీయించుకున్నారు.

మహిళల ఆత్మ గౌరవానికి అవమానం..

బతుకమ్మ అనేది కేవలం పూల పండుగ మాత్రమే కాదు.. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతితో ముడిపడిన జీవన సంస్కృతికి ప్రతీక. అలాంటి పండుగలో నిమజ్జనం కోసం నీటి గుంతలు తవ్వాల్సిన పరిస్థితి రావడం విచారకరం. ఇది మహిళల ఆత్మగౌరవానికి అవమానం అంటున్నారు పలువురు మహిళలు. బతుకమ్మలు వేసేందుకు ఇబ్బందులు పడకుండా అధికారులు తక్షణమే స్పందించి, నిమజ్జన ప్రాంతాల్లో తగిన నీటి సౌకర్యాలు కల్పించాలని కీసర మాజీ సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్ కోరారు. అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.