Wednesday, October 14, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeCrimeబొల్లారం ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్‌

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్‌

📰 Generate e-Paper Clip

  • అదుపులో ముగ్గురు ఆర్మీ సీనియర్ అధికారులు!
  • దర్యాప్తు మరింత ముమ్మరం

సిటీ క్రైమ్ ( ప్రభంజనం ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి మాయమైన కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ముగ్గురు ఆర్మీ అధికారులను మిలటరీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఆయుధాల చోరీలో అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉందా? భద్రతా విధుల్లో నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది? అనే కోణాల్లో విచారణ సాగుతోంది. ఆగస్టు 31న బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారాన్ని తనిఖీ చేసిన సమయంలో ఆయుధాలు, మ్యాగజైన్లు, మందుగుండు సామాగ్రి కనిపించకపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తొలుత ఇది ఒకేసారి జరిగిన చోరీగా భావించినప్పటికీ, దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కొంతకాలంగా విడతలవారీగా మాయమై ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

భద్రతా లోపాలపై తీవ్ర అనుమానాలు

ఆయుధాగారం వంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో చోరీ జరగడంతో భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. రాత్రివేళ సీసీటీవీ పర్యవేక్షణలో లోపాలు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. ఆయుధాగారానికి సంబంధించిన విధుల్లో ఉన్న సిబ్బందిని ఇప్పటికే విచారించారు. పోలీసులు, ఆర్మీ అధికారులు, మిలటరీ ఇంటెలిజెన్స్ కలిసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, సిబ్బంది కదలికలు, విధుల వివరాలు, కమ్యూనికేషన్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆయుధాగారంలోకి బయటి వ్యక్తులు ప్రవేశించారా లేదా లోపలి వ్యక్తుల సహకారంతోనే చోరీ జరిగిందా అన్నది ప్రధానంగా పరిశీలిస్తున్నారు.

రంగంలోకి ఎన్ ఐఏ

కేసు తీవ్రత దృష్ట్యా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) కూడా విచారణలో భాగమైంది. మాయమైన ఆయుధాలు ఇతర నేర కార్యకలాపాలకు లేదా ఉగ్రవాద/అతివాద కార్యకలాపాలకు మళ్లించబడ్డాయా అనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో బొల్లారం మిలటరీ ప్రాంతంలోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో 160 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు గుర్తించడం దర్యాప్తును మరింత సీరియస్‌గా మార్చింది. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు ఆయుధాల చోరీకి ఏమైనా సంబంధం ఉందా అన్నదీ పరిశీలిస్తున్నారు.

అసలు చోరీ ఎలా జరిగింది?

ఆయుధాగారం అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఉండటం, అక్కడ సిబ్బంది విధుల్లో ఉండటం, అయినప్పటికీ ఆయుధాలు మాయమవడం దర్యాప్తు అధికారులకు పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే పలువురు ఆర్మీ సిబ్బందిని విచారించిన అధికారులు, ఇప్పుడు బాధ్యతలు నిర్వహించిన ఉన్నతాధికారులపైనా దృష్టి సారించారు. ముగ్గురు ఆర్మీ అధికారులను అదుపులోకి తీసుకోవడం ఈ కేసులో కీలక పరిణామం. అయితే వారి అరెస్టు, వారిపై నమోదైన నిర్దిష్ట అభియోగాలు, వారి పాత్రపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మాయమైన సామాగ్రి ఆచూకీ, చోరీ వెనుక ఉన్న వ్యక్తులు, అంతర్గత సహకారం ఉందా, భద్రతా వైఫల్యాలకు ఎవరు బాధ్యులు అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.