Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaరంగారెడ్డికోట్ల విలువైన ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా...

కోట్ల విలువైన ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా…

📰 Generate e-Paper Clip

  • బోర్డు తీసేసి ప్లాట్ల విక్రయం
  • అధికారులు స్పందించి కబ్జాలను అడ్డుకోకపోతే కలెక్టరేట్ ముట్టడి
  • బాధితులు, ప్రజల హెచ్చరిక

జవహర్ నగర్, (ప్రభంజనం)

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని 338 సర్వే నంబర్‌లోని విలువైన ప్రభుత్వ భూమి కబ్జాదారుల పాలువుతున్నా సంబంధిత అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడంపై స్థానిక ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో ఉన్న తహసీల్దార్ ఈ సర్వే నంబర్‌లోని స్థలం ప్రభుత్వానికి చెందినదిగా నిర్ధారించి, అక్కడ హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. పైగా అందులో ఒక ఎకరం స్థలాన్ని ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే, అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకున్న కొంతమంది భూబకాసురులు ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డునే తొలగించారు. ఆ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించి, రాత్రికి రాత్రే ప్లాట్లుగా మార్చి అమాయక ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

మాటలకే పరిమితమైన అధికారుల హెచ్చరికలు!

గత జూన్ 6న కాప్రా తహసీల్దార్ మతీన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, దళారుల చేతిలో ప్లాట్లు కొని మోసపోవద్దు, ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కాపాడతాం అని గంభీర ఉపన్యాసాలు చేశారు. కానీ ఆ ప్రకటనలు కేవలం నీటి మూటలుగానే మిగిలిపోయాయని స్థానికులు మండిపడుతున్నారు. కళ్లముందే ప్రభుత్వ భూమి విక్రయాలు జరుగుతున్నా తహసీల్దార్ గానీ, ఇతర రెవెన్యూ అధికారులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ముడుపుల మత్తులో రెవెన్యూ యంత్రాంగం?

కబ్జాదారులు దర్జాగా స్థలాన్ని ఆక్రమించి విక్రయిస్తుంటే అధికారులు నోరు మెదపకపోవడం వెనుక భారీగా ముడుపులు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజా అవసరాలకు, బడి నిర్మాణానికి కేటాయించిన స్థలాలు మాయమవుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పై అధికారులైనా స్పందించేనా?

ఈ దౌర్జన్య కబ్జాలపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 338 సర్వే నంబర్ పరిధిలోని ప్రభుత్వ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, వెంటనే ఆక్రమణలను తొలగించాలని, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి విక్రయిస్తున్న దళారులు, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని, అక్రమార్కులతో చేతులు కలిపి ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో విఫలమైన అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను తీవ్రతరం చేసి, కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని బాధితులు, స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.